21న జాలాది రత్నసుధీర్ కథా సంపుటి ఆవిష్కరణ
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా... అనే పాట విన్నాము, అలాగే మనసు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతే అనే నిట్టూర్పుని విన్నాము. మనసుని కేంద్రంగా చేసుకొని వచ్చిన సినిమా పాటలు అనేకం. అయితే మనసును, మానవ మనస్తత్వాన్ని కేంద్రంగా చేసుకొని జాలాది రత్నసుధీర్ కొన్నాళ్ళుగా కథలు రాస్తున్నారు. వారి కొత్త కథల సంపుటి ‘మనసు పలికిన...’ ఆవిష్కరణ సభ ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో జరుగుతుంది.
పదిహేను కథల సమాహారం ‘మనసు పలికిన...’. ఈ పుస్తకానికి విహారి ముందుమాట రాస్తూ వ్యక్తి వికాసానికి ఈ కథలు తోడ్పడతాయని చెప్పిన మాట అక్షర సత్యం. మానవ సంబంధాలను, మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, పిల్లల పెంపకంలో మనస్తత్వ పరిశీలన ప్రాముఖ్యతను ఈ కథలు వివరిస్తాయి. రత్నసుధీర్ ఇదివరలో ‘మనసు కథలు’ పేరుతో ఒక సంపుటి వెలువరించారు. మనసును కేంద్రంగా చేసుకొని రాసిన రెండో కథల సంపుటి ఇది. మనిషి మనసు ఎంత చిత్రమైనదో, ఎన్ని హోయలు పోతున్నదో కథల ద్వారా చెప్పడం విశేషం. ‘గుప్పెడుమనసు’ ఎన్నిరకాలుగా భావోద్వేగాలకు లోను చేస్తుందో చెప్పిన తీరు ఆసక్తికరం.
కథకునిగా ప్రసిద్ధి చెందిన జాలాది రత్న సుధీర్ కవి, గేయకర్త, నాటకకర్త, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయిత. కవిత్వం రాశారు. కొన్ని సినిమాలకు పాటలు రాశారు. యూట్యూబ్ చానల్ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన వారి ప్రసంగాలు యువతకు స్ఫూర్తిదాయకం. కథా రచయితగా సమాజ గమనాన్ని, మనుషుల్లోని వైరుధ్యాలను చిత్రించారు. రాయకుండా ఉండలేనప్పుడు కవితలు రాశారు.
మరీ ముఖ్యంగా అమ్మను కేంద్రంగా చేసుకొని ‘అమ్మ చెక్కిన శిల్పం’ పేరుతో ఒక వ్యాసాల పుస్తకం వెలువరించారు. ఇది వారి నుంచి వెలువడిన గొప్ప కంట్రిబ్యూషన్. విభిన్న రంగాలలో ప్రఖ్యాతి చెందిన వారి జీవితంలో వారి మాతృమూర్తులు పోషించిన పాత్రని ఒక్కొక్క వ్యాసంలో వివరించారు. భిన్న రంగాలకు చెందిన 26 మంది ప్రముఖుల జీవితంలో వారి తల్లుల పాత్రని చెప్పడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఈ పుస్తకం చదివితే తమ తల్లి గురించి కూడా ఇలా చెప్పాలన్న ఉత్సాహం కలుగుతుంది ఎవరికయినా.
ఇప్పటివరకు రత్న సుధీర్ వెలువరించిన పుస్తకాలు.
1. మనసు కథలు
2. మనసు పలికిన...
3. అమ్మ చెక్కిన శిల్పం
4. గెలవాలంటే... (విజయవానికి ఏడు సూత్రాలు)
5. ప్రక్షాళన (కవిత్వం)
6. స్పర్శ (కవిత్వం)
తెలుగులోనే కాదు ఇంగ్లీషులోనూ రాయగలిగిన ప్రతిభావంతులు రత్నసుధీర్. అమ్మ చెక్కిన శిల్పం, గెలవాలంటే పుస్తకాలను తనే ఆంగ్లంలోకి అనువదించి, పుస్తకాలుగా వెలువరించారు. రెండు భాషల్లోనూ మంచి పట్టు ఉన్న సృజనశీలి రత్నసుధీర్. నిరంతర అధ్యయనం, రచనా వ్యాసంగం ఆయన బతుకుయానంలో అంతర్భాగం. వారి పుస్తకం ‘మనసు పలికిన...’ ఆవిష్కరణ సభకు ఇదే ఆహ్వానం. ప్రముఖ రచయిత సి.ఎస్. రాంబాబు అధ్యక్షతన జరిగే ఈ సభలో పుస్తకాన్ని ఆచార్య కొలుకలూరి ఇనాక్ ఆవిష్కరిస్తారు. సభలో ఇంకా విహారి, ఎ. దినకరబాబు, గుడిపాటి ప్రసంగిస్తారు.