Telugu Global
Andhra Pradesh

సచివాలయ సిబ్బందిని కూలీలుగా మార్చేస్తారా..? ఇదెక్కడి ఘోరం

సచివాలయాల స్టాఫ్ ని కూలీలుగా మార్చి, స్నాక్స్ అందించే డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

సచివాలయ సిబ్బందిని కూలీలుగా మార్చేస్తారా..? ఇదెక్కడి ఘోరం
X

గుంటూరులో జరిగిన స్వాతంత్ర దినోత్సవాల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల్లో సచివాలయ సిబ్బందికి ఘోర అవమానం జరిగిందని వైసీపీ అంటోంది. గ్రామ, వార్డు సచివాలయాల స్టాఫ్ కి అతిథులకు స్నాక్స్ అందించే డ్యూటీలు వేశారని వైసీపీ నేతలంటున్నారు. అంతే కాదు, దానికి సంబంధించిన వార్తల్ని, ఆదేశాల కాపీని కూడా సోషల్ మీడియాలో ఉంచారు.


జగన్ పై కోపంతో..

సచివాలయాలను, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది జగన్ కాబట్టి.. ఆయనపై కోపంతో కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. కేవలం జగన్ పై కోపంతోనే వాలంటీర్ వ్యవస్థను తీసేశారని, ఇప్పుడు సచివాలయాలపై పగబట్టారని చెబుతున్నారు. సచివాలయ స్టాఫ్ ని కూలీలుగా మార్చి, వారికి స్నాక్స్ అందించే డ్యూటీలు వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. ఈ డ్యూటీల వల్ల సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు.

గతం మరచిపోయారా..?

టీడీపీ కూడా వెంటనే కౌంటర్లు రెడీ చేసింది. స్నాక్స్ పంపిణీ పర్యవేక్షణ డ్యూటీ వేస్తే.. దాన్ని కూలి పనిగా అభివర్ణించడం వైసీపీకే చెల్లిందని టీడీపీ నేతలంటున్నారు. గతంలో వైన్ షాపుల వద్ద టీచర్లకు కాపలా డ్యూటీ వేసిన జగన్, స్కూల్ టీచర్లతో మరుగుదొడ్ల ఫొటోలు తీసి యాప్స్ లో అప్ లోడ్ చేయించిన జగన్.. ఇప్పుడిలా మాట్లాడటం విడ్డూరం అంటున్నారు.

First Published:  16 Aug 2024 10:45 AM IST
Next Story