Telugu Global
Andhra Pradesh

ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి వైసీపీ ఫిర్యాదు..

ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.

ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కి వైసీపీ ఫిర్యాదు..
X

ఏపీలో ఎన్నికలు జరిగిన తీరు తదనంతర పరిణామాలపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఎన్నికల పోలింగ్‌ శాతంపై రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయని, వాటిని నివృత్తి చేయాలని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబటి సహా వైసీపీ నేతలు ఈరోజు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ను కలిశారు. ఎన్నికల సరళిపై వైసీపీ వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేయాలని వారు ఏపీ సీఈఓని కోరారు.


పోలింగ్ శాతం విషయంలో ఎన్నికల తర్వాత ఈసీ వేర్వేరు ప్రకటనలు చేసిందని గుర్తు చేశారు అంబటి రాంబాబు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంత శాతం పోలింగ్‌ నమోదైంది, ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాలను ఈసీ వెల్లడించలేదని చెప్పారు. ఫారం-20 సమాచారాన్ని వెంటనే అప్‌లోడ్‌ చేయాలని సీఈఓని వైసీపీ నేతలు కోరారు.


ఈవీఎంలపై కూడా తమకు అనుమానాలున్నాయని చెప్పారు వైసీపీ నేతలు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయొచ్చని మొదట చెప్పింది చంద్రబాబేనన్నారు. గతంలో ఈవీఎంలపై ఆయన కూడా ఫిర్యాదు చేశారన్నారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వీవీప్యాట్‌లో కూడా అన్నే చూపించాలని, కానీ ఏపీలో ఈవీఎం తనిఖీల్లో అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. వీవీప్యాట్లు లెక్కించకుండా కేవలం మాక్ పోలింగ్ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. తమ అనుమానాల్ని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. తమ ఆరోపణలపై ఈసీ స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. ఆరుగంటల తర్వాత కేవలం క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే అవకాశమిస్తారని, అయితే ఏపీలో అనూహ్యంగా ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. అక్రమాలు జరిగాయనే అనుమానం అందరిలో ఉందని, దాన్ని ఎన్నికల కమిషన్ నివృత్తి చేయాలన్నారు.

First Published:  27 Aug 2024 3:02 PM IST
Next Story