Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం

అంతకుముందు బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రమాణానికి వెళుతున్న బొత్సను జగన్ అభినందించారు.

ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం
X

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ మోషేన్ రాజు తన ఛాంబర్‌లో బొత్స సత్యనారాయణతో ప్రమాణం చేయించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. టీడీపీ -బీజేపీ -జనసేన కూటమికి సరైన బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండగా.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ మాత్రమే పోటీలో నిలిచారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ప్ర‌మాణ‌స్వీకారం అనంత‌రం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు తనను రాజకీయాలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. ఇప్పటికీ తమ పార్టీ మూడు రాజధానుల విధానానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ తమ విధానం విశాఖ పరిపాలన రాజధానేనని, దీనిపై అవసరమైతే తాము పార్టీ అధినేతతో కలిసి కూర్చొని చర్చిస్తామని చెప్పారు.

స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ మారడం, చేరడం ఒక్క ఏపీలోనే జరగడం లేదు కదా? అని బొత్స ప్రశ్నించారు. రాష్ట్రంలో దౌర్జన్యం, దమనకాండకు వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. కేసులు అధికారులపై పెడుతున్నారా? ఎవరిమీద పెడుతున్నారు? అనే విషయాలు ముఖ్యం కాదన్నారు. తప్పు చేసినట్లు నిరూపణ అయితే శిక్షించాలని.. శిక్షించవద్దని తాము ఎప్పుడూ అనలేదని బొత్స వ్యాఖ్యానించారు.

అంతకుముందు బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రమాణానికి వెళుతున్న బొత్సను జగన్ అభినందించారు.

First Published:  21 Aug 2024 12:27 PM GMT
Next Story