ఈనెల 30న 'ఇండియా' నిరసన.. వైసీపీ హాజరవుతుందా..?
ఇప్పటి వరకు జగన్ అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమికి సమ దూరం పాటిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన ఏ గట్టున ఉండాలి అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.
'ఇండియా' కూటమికి వైసీపీ దగ్గరవుతోందా..? ఢిల్లీలో ధర్నా తర్వాత సోషల్ మీడియాలో ఈ విషయంపై విస్తృతంగా చర్చ జరిగింది. వైసీపీ ధర్నాకు ఇండియా కూటమిలోని కీలక పార్టీలు మద్దతు తెలపడంతో ఈ ప్రచారం మొదలైంది. సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ సేన వర్గం సహా మరికొన్ని పార్టీలు వైసీపీకి మద్దతుగా ధర్నా శిబిరం వద్దకు వచ్చి ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించాయి. ఇలాంటి ఘటనలు ఏ రాష్ట్రంలో జరిగినా తాము ఖండిస్తామని తెలిపాయి. జగన్ పోరాటానికి తాము మద్దతిస్తున్నట్టు చెప్పారు నేతలు. ఆ తర్వాత ఆయా పార్టీల అధినేతలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. అక్కడితో ఆ ఎపిసోడ్ పూర్తయింది.
అసలు కథ ఇప్పుడు..
ఈనెల 30న ఇండియా కూటమి ఢిల్లీలో ధర్నా చేపట్టబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంపై ఇండియా కూటమి ఘాటుగా స్పందిస్తోంది. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించినా ఆయనపై కనికరం చూపడంలేదని, ఒక కేసులో బెయిలొస్తే, మరో కేసులో ఆయన్ను ఖైదులోనే ఉంచి నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారనేది కూటమి నేతల ఆరోపణ. కేంద్రం తీరుకి వ్యతిరేకంగా ఈనెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూటమి నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. మరి ఈ ఆందోళనలో వైసీపీ పాల్గొంటుందా, నేరుగా జగన్ వస్తారా, లేక ఎంపీలను పంపించి సరిపెడతారా..? అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటి వరకు జగన్ అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమికి సమ దూరం పాటిస్తూ వచ్చారు. కానీ తొలిసారిగా ఢిల్లీ ధర్నా తర్వాత ఆయన ఏ గట్టున ఉండాలి అనేది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. మాకు అన్యాయం జరిగింది, మీరందరూ మద్దతివ్వండి అని అన్ని పార్టీలకు జగన్ లేఖలు రాశారు, రేపు కేజ్రీవాల్ అన్యాయం గురించి కూటమి నేతలు గొంతెత్తితే ఆయన మద్దతివ్వాల్సిన అవసరం కచ్చితంగా ఉంటుంది. అదే జరిగితే, జగన్ ఇండియా కూటమికి మరింత దగ్గరవుతారు. ఒకవేళ ఆ ధర్నాకు జగన్ దూరంగా ఉంటే మాత్రం భవిష్యత్ లో వైసీపీ ఆందోళనలను మిగతా పార్టీలు పూర్తిగా లైట్ తీసుకుంటాయి. కేంద్ర రాజకీయాల్లో వైసీపీ స్టాండ్ ఏంటనేదానిపై ఈనెల 30న క్లారిటీ వస్తుంది.