Telugu Global
Andhra Pradesh

హోదాలేదు.. ఏపీకి ప్యాకేజీయే

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

హోదాలేదు.. ఏపీకి ప్యాకేజీయే
X

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగలేదు. అంటే ఇక్కడ ఏపీ ప్రత్యేక హోదా అనే అంశమే ప్రస్తావనకు రాదు. హోదా కావాలంటూ డిమాండ్ చేసిన బీహార్ కి కూడా కేంద్రం వట్టిచేతులు చూపించింది. కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులే ఇప్పుడు రాష్ట్రాలకు ప్రధాన అంశంగా మారాయి. ఈ దశలో ఏపీకి కేంద్ర బడ్జెట్ లో కొన్ని వరాలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.


అమరావతి కోసం..

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ సత్వర నిర్మాణానికి పూర్తి సాయం అందిస్తామని కూడా ఆమె తెలిపారు. ఇక ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రధాన అంశంగా మారింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు కేంద్ర మంత్రి.

విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి కూడా ఏపీకి ప్రత్యేక సహాయం చేస్తామని ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పరిధిలో ఉన్న నోడ్ లకు ప్రత్యేక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ జోన్ లకు మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. మొత్తమ్మీద అమరావతి నిర్మాణానికి ఇస్తామన్న 15వేల కోట్ల రూపాయలు మినహా... మిగతావన్నీ వట్టి హామీలుగా మిగిలిపోయే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

First Published:  23 July 2024 12:33 PM IST
Next Story