తిరుమల విజన్- 2047’ ప్రారంభం
తిరుమల విజన్- 2047’ను ప్రారంభించింది.
తిరుమల బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రా విజన్-2047కు అనుగుణంగా తిరుపతిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే ప్రణాళికతో ‘ తిరుమల విజన్- 2047’ను ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది. తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికతతో సమతుల్యం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించిన మేరకు టీటీడీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. తిరుమల విజన్ 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, పట్టణ ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ నిర్వహణపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను టీటీడీ ఆహ్వానిస్తోందని ఒక ప్రకటనలో వెల్లడించారు.
తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం, శ్రీవారి పవిత్రతను కాపాడుతూ భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి భవిష్య వ్యూహాలను రూపొందించడం లాంటి ప్రణాళిక రూపకల్పన కోసం కన్సల్టెంట్‌ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. మూడు వారాల్లోగా ఆసక్తి గల ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలను కోరుతున్నట్లు టీటీడీ వివరించారు. ఇలాంటి భారీస్థాయి పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఏజెన్సీలకు ముందస్తు అనుభవం తప్పనిసరిగా ఉండాలని సూచించింది.