Telugu Global
Andhra Pradesh

బాబు సంగతి సరే.. మీ సంగతేంటి..?

మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, సన్నబియ్యం పంపిణీ.. ఇలా జగన్ ఫిరాయించిన ప్లేట్లు 999 ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.

బాబు సంగతి సరే.. మీ సంగతేంటి..?
X

అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఖజానా ఖాళీ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా పేదలకు ద్రోహం చేస్తున్నారంటూ జగన్ సుదీర్ఘ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ కి వెంటనే టీడీపీ నుంచి కౌంటర్ పడింది. అవును ఈ రాష్ట్రం బాధ్యత చంద్రబాబుదేనంటూ టీడీపీ అధికారిక ఖాతా ద్వారా బదులు వచ్చింది.


ఆత్ర పడొద్దు..

రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం అంటూ జగన్ ట్వీట్ కి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. సంపద సృష్టిస్తామనే హామీతో తాము అధికారంలోకి వచ్చామని, కచ్చితంగా సంపద సృష్టిస్తామని, నాశనమైపోయిన వ్యవస్థలను ముందు గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం చంద్రబాబు ఆ పనిలోనే ఉన్నారని చెప్పుకొచ్చారు టీడీపీ నేతలు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి కేవలం 55 రోజులే అయిందని, జగన్ చేసిన 5 ఏళ్ళ విధ్వంసం, 50 రోజుల్లో సెట్ చేయటం సాధ్యం కాదని అన్నారు. అది అమెరికా వల్ల కూడా కాదని, కాస్త ఆత్రం తగ్గించుకోవాలని ఆ ట్వీట్ లో హితవుపలికారు.

ప్లేటు ఫిరాయించడమంటే..?

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి కూడా టీడీపీ కౌంటర్ ఇచ్చింది. అసలు ప్లేట్ ఫిరాయించడం అంటే.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆ తర్వాత ఢిల్లీకి సాగిలపడటం అని పేర్కొంది. 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పి ఆ తర్వాత తానలా అనలేదని బుకాయించడం కూడా ప్లేటు ఫిరాయింపేనంది. మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, సన్నబియ్యం పంపిణీ.. ఇలా జగన్ అసత్యాలు చెప్పి అధికారంలోకి వచ్చారని, కనీసం ఇప్పుడు వాటిపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు టీడీపీ నేతలు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ ఫిరాయించిన ప్లేట్లు 999 ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు. ఖజానా ఖాళీ చేసిన జగన్ రాష్ట్రంలో ప్రతి కుటుంబంపై రూ.5 లక్షల అప్పు భారం పెట్టి వెళ్లారని అన్నారు.

నిజాలు చెబుతుంటే వైసీపీ ఎందుకు ఏడుస్తోందని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ నిజాలన్నీ జనాలకు తెలియాలి కాబట్టే వైట్ పేపర్లు విడుదల చేస్తున్నామని, అసెంబ్లీ ఎగ్గొడితే ఇలాంటి విషయాలు వారికి తెలిసే అవకాశం లేదని విమర్శిస్తూ ట్వీట్ వేసింది.

First Published:  11 Aug 2024 8:24 AM IST
Next Story