ఏపీకి ప్రత్యేక హోదా రావడం టీడీపీకి ఇష్టంలేదు
రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు.
బడ్జెట్ సమావేశాలు మొదలయ్యే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా 44 పార్టీలనుంచి 55మంది నేతలు హాజరయ్యారు. తమ రాష్ట్రాల సమస్యలను, డిమాండ్లను అఖిలపక్షం ముందు ఉంచారు. ఏపీకి సంబంధించి ప్రతిపక్ష వైసీపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేసింది. అదే సమయంలో టీడీపీ మాత్రం అమరావతి, ఆర్థిక సమస్యలను ప్రస్తావించింది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేతలు టీడీపీ వైఖరిని ఎండగట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.
ఏపీకి హోదా రావడం టీడీపీకి ఇష్టం లేదు!!
— YSRCP Brigade (@YSRCPBrigade) July 21, 2024
- విజయ్ సాయి రెడ్డి pic.twitter.com/kxUQkU7GS6
ఏపీకి ప్రత్యేక హోదా రావాలని టీడీపీ కోరుకోవట్లేదని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి హోదా రావడం ఆ పార్టీ నేతలకు ఇష్టం లేదన్నారు. అందుకే వారు అఖిలపక్ష సమావేశంలో హోదాకోసం డిమాండ్ చేయలేదని గుర్తు చేశారు. నిధులకోసమే వారు పాకులాడారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిపై కూడా టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి టీడీపీ నిధులకోసం మాత్రమే ఆరాటపడుతోందని అన్నారాయన.
ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. 2014నుంచి 2019 వరకు ఈ విషయంలో వైసీపీ ఏం చేసిందనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ.. పట్టుబట్టి మరీ ప్రత్యేక హోదా సాధించొచ్చని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏపీలో టీడీపీ సీట్లు కూటమి ప్రభుత్వానికి కీలకం కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లోనే హోదాని సాధించుకోవచ్చని, దానికి ఇదే సరైన సమయం అంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకోవట్లేదని వైసీపీ విమర్శిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.