Telugu Global
Andhra Pradesh

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌..?

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన టైంలోనూ చంద్రబాబు కేంద్రప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారని, ప్రైవేటీకరణతో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు వస్తాయని చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో గుర్తు చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ గ్రీన్‌ సిగ్నల్‌..?
X

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఏపీలోని కూట‌మి ప్రభుత్వం ఓకే చెప్పిందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ - RINLగా కూడా పిలువబడే విశాఖ స్టీల్ ప్లాంట్‌ నుంచి వ్యూహాత్మక పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి టీడీపీ మద్దతిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం NDA కూటమిలో టీడీపీ కీలకంగా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌ ఓ సంచలన కథనం రాసుకొచ్చింది.

టీడీపీ మద్దతుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ మరింత వేగంగా సాగే అవకాశం ఉందని తెలిపింది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన టైంలోనూ చంద్రబాబు కేంద్రప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారని, ప్రైవేటీకరణతో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు వస్తాయని చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో గుర్తు చేసింది. ఆఫ్‌ ది రికార్డులో ఓ టీడీపీ కీలక నేత సైతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మద్దతు అంశాన్ని ధృవీకరించారని సమాచారం.


ప్రస్తుతం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ (విశాఖ స్టీల్ ప్లాంట్) కెపాసిటీ 7 మిలియన్ టన్నులుగా ఉంది. స్టీల్ ధరలు తగ్గడం, సొంతంగా గనులు లేకపోవడంతో మూడు, నాలుగేళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోయింది. కాగా, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్లాంట్‌కు రూ.23 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నట్లు సమాచారం.

ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు విశాఖ స్టీలు ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పోటాపోటీ హామీలు ఇచ్చాయి. పవన్‌కల్యాణ్‌ లాంటి నేతలు స్వయంగా మోడీని కలిసి విశాఖ ప్రైవేటీకరణను ఆపేందుకు ఒప్పిస్తానని చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా టీడీపీ అభ్యర్థి లోకేష్ తోడ‌ల్లుడు భరత్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. మరోవైపు ప్రైవేటీకరణను అడ్డుకుంటారన్న నమ్మకంతోనే కూటమి అభ్యర్థికి ఓటు వేశామంటున్నారు విశాఖ వాసులు.

ఇక స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్‌పై వైసీపీ స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని మండిపడింది.

First Published:  9 July 2024 6:21 PM GMT
Next Story