Telugu Global
Andhra Pradesh

మన పని మనం చేసుకుందాం..! వైరివర్గాల పేరెత్తని రోజా

రోజా ప్రసంగంలో చాలా మార్పులొచ్చాయి. విమర్శనాస్త్రాల ప్రయోగాన్ని పక్కనపెట్టి.. వైసీపీ కార్యాచరణపైనే ఫోకస్ పెట్టారామె.

మన పని మనం చేసుకుందాం..! వైరివర్గాల పేరెత్తని రోజా
X

వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈరోజు చాలామంది వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చారు. వైఎస్ఆర్ ని స్మరించుకుంటూ, ఆయన పాలనతో జగన్ పాలనను పోల్చి చెప్పారు. పనిలో పనిగా కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ.. ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు, హామీలు నిలబెట్టుకోలేకపోతే తగిన గుణపాఠం చెబుతామన్నారు. అయితే సహజంగానే వైరి వర్గాలపై విమర్శలతో విరుచుకుపడే మాజీ మంత్రి రోజా మాత్రం పూర్తిగా తన స్టైల్ మార్చారు. ఎక్కడా టీడీపీ, జనసేన పేరెత్తలేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్.. పేర్లు తన ప్రసంగంలో తీసుకు రాలేదు. తాను చెప్పాలనుకున్నది సూటిగా, స్పష్టంగా చెప్పారు. మళ్లీ జగన్ ని సీఎంగా గెలిపించుకోవాలని, వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని, దానికోసం ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు రోజా.


వైసీపీ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడే నేతల్లో రోజా ముందు వరుసలో ఉండేవారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేవారు కాదు రోజా. గతంలో చంద్రబాబు పాలన బాగుండేది అన్నందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ పై కూడా ఘాటు విమర్శలు చేశారు రోజా. ఫలితాల తర్వాత ఆమె మాటతీరు క్రమంగా మారింది. గతంలో లాగా తరచూ మీడియా ముందుకు రాకపోయినా.. అప్పుడప్పుడూ తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారామె. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రోజా ప్రసంగం హుందాగా సాగిపోయింది. గత వైఎస్ఆర్ పాలనను మెచ్చుకున్నారు, అలాంటి పాలనే జగన్ అందించారని చెప్పారు, అదే పాలన మళ్లీ కావాలంటున్నారు రోజా.

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అంటున్న రోజా.. పొరపాటున గత ఎన్నికల్లో ఓడిపోయామని, ఓడిపోవడం బాధాకరమైన విషయమైనా.. మనం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని చెప్పారు. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా.. ఎల్లప్పుడూ వైసీపీ ప్రజాపక్షంలో ఉంటుందన్నారు. రాజన్న పాలన మళ్లీ రావాలని, రాజన్న బిడ్డ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు దూరమయ్యేలా అందరం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు రోజా. విమర్శనాస్త్రాల ప్రయోగాన్ని పక్కనపెట్టి.. వైసీపీ కార్యాచరణపైనే ఫోకస్ పెట్టారు.

First Published:  8 July 2024 3:20 PM IST
Next Story