జంప్ జిలానీలు జగన్ కి అవసరం లేదు
అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఆ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదని అన్నారు పేర్ని నాని.
ఎంపీల రాజీనామా నేపథ్యంలో వైసీపీ నుంచి ఘాటు వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కేవలం జగన్ వల్లనే ఒక మత్స్యకారుడు పెద్లల సభలో అడుగుపెట్టగలిగారని గుర్తు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అలాంటి వారంతా ఇప్పుడు జంప్ జిలానీలు అయ్యారని ఎద్దేవా చేశారు. పార్టీ మారేవారంతా చంద్రబాబుకి అమ్ముడుపోయినట్టేనని చెప్పారు. చంద్రబాబు గెలవాలంటే ఇతర పార్టీల సాయం అవసరం అని, జగన్ గెలవాలంటే జనం సాయం చాలు అని అన్నారు పేర్ని నాని. స్వార్థంతో రాజకీయాలు చేసే జంప్ జిలానీ బ్యాచ్‌లు జగన్‌ని అవసరం లేదని తేల్చి చెప్పారు.
వైనాట్ 2029
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, 2029 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు పేర్ని నాని. 2029లో విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అసలు వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది, వారికి పదవులు కట్టబెట్టింది జగనేనని చెప్పారు పేర్ని నాని. రాజ్యసభలో ఖాళీ అయిన రెండు పదవుల్లో చంద్రబాబు అదే సామాజిక వర్గాల వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారన్నారు.
ఏనాడో టీడీపీ ఖాళీ అయ్యేది..
అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారన్నారు నాని. తాము ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదని చెప్పారు. ఇప్పుడు ఏపీలో లావాదేవీలే తప్ప రాజకీయాలు లేవని అన్నారు. తాజాగా ఓ సినీనటి కేసు తెరపైకి తెచ్చి తమపై బురదజల్లాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఐపీఎస్ అధికారులను వేధించడమే లక్ష్యంగా ఎల్లో మీడియా డ్రామా చేస్తోందన్నారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయాక.. కుక్కల విద్యాసాగర్ కు తమ పార్టీకి సంబంధమే లేదన్నారు పేర్ని నాని.