మదనపల్లె మిస్టరీ: ఫైళ్లు తగలబడ్డాయా..? తగలబెట్టారా..?
ఈ ఘటన వెనక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు.
ఆమధ్య పర్యాటక శాఖకు చెందిన కీలక ఫైళ్లను కొందరు వ్యక్తులు తగలబెట్టారనే ఆరోపణలు వినిపించాయి. విచారణలో ఇంకా నిజానిజాలు బయటకు రాలేదు. ఈలోగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది, కీలక ఫైళ్లు తగలబడ్డాయి. ఇప్పటి వరకు ఇది షార్ట్ సర్క్యూట్ ఫలితం అనుకున్నారు కానీ, ఇందులో కుట్రకోణం ఉందని సాక్షాత్తూ డీజీపీ చెప్పడం విశేషం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లెకు వెళ్లిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అది యాక్సిడెంట్ కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సంచలన విషయాలు బయట పెట్టిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.
— Telugu Desam Party (@JaiTDP) July 22, 2024
"మదనపల్లె ఘటన ప్రమాదం కాదు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే… pic.twitter.com/D5AoHuVgOs
ఈ ఘటన వెనక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెవెన్యూ, పోలీస్ అధికారుల అలసత్వం ఉందని ప్రాథమికంగా నిర్థారించినట్టు తెలిపారు. అగ్నిప్రమాదం తర్వాత వెంటనే కలెక్టర్ కి సమాచారం ఇవ్వలేదని, ఎస్పీకి కూడా ఆలస్యంగా వివరాలు తెలిశాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఆలస్యంగా చేరవేశారని చెప్పారు డీజీపీ. ఆ బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ కి అవకాశం లేదని విచారణలో తేలినట్టు స్పష్టం చేశారాయన. ఈ కేసుని సీఐడీకి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
పెద్దిరెడ్డిపై ఆరోపణలు..
ఈ ఘటనకు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ల్యాండ్ కన్వర్షన్ జరిగిందని ఆయన అన్నారు. ఆ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఫైళ్లు తగలబెట్టి ఉంటారన్నారు. పెద్దిరెడ్డి మీద.. స్థానిక వైసీపీ నేతల మీద తమకు అనుమానం ఉందన్నారు. ఆర్డీవో, ఎమ్మార్వో సహా ఇతర రెవెన్యూ ఉద్యోగుల మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. ఉద్యోగులు పని చేస్తే సక్రమంగా చేయాలని, లేకుంటే పక్కకు తప్పుకోవాలని హెచ్చరించారు మంత్రి అనగాని. ఫైళ్లు మాయమైనా.. ఆన్ లైన్ లో ఉన్న వివరాల మేరకు తప్పుల్ని గుర్తించే అవకాశముందని, తప్పులు ఎవరు చేసినా, తప్పించుకోలేరని అంటున్నారు టీడీపీ నేతలు.