Telugu Global
Andhra Pradesh

చదువు చెప్పండి చాలు.. లోకేష్ ట్వీట్

ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని అన్నారు మంత్రి లోకేష్.

చదువు చెప్పండి చాలు.. లోకేష్ ట్వీట్
X

ఏపీలో విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నట్టు తెలిపారు మంత్రి నారా లోకేష్. గతంలో టీచర్లకు బోధనతోపాటు అనేక ఇతర పనులు కూడా అప్పగించారని, వాటి నుంచి ఇప్పుడు వారికి విముక్తి కల్పిస్తున్నామని అన్నారు. బోధనేతర విధుల వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పడంపై వారు సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోయారని, ఇప్పుడు ఆ బాధలు టీచర్లకు లేవని భరోసా ఇచ్చారు. ఈమేరకు లోకేష్ ఓ ట్వీట్ వేశారు.


ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్ల ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదని అన్నారు మంత్రి లోకేష్. ఈ విధానాన్ని ఆపేశామని, మరుగుదొడ్లు ఫొటోలు తీయాల్సిన కంపల్సరీ ఆప్షన్ ని యాప్ నుంచి కూడా తొలగించామన్నారు. ఇకపై టీచర్ల బాధ్యత ఒకటేనని, నాణ్యమైన విద్యను పిల్లలకి అందిస్తే చాలని చెప్పారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన టీచర్లకు సూచించారు. వారి సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు లోకేష్.

గత ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్ల ఫొటోలను ఉదయాన్నే తీసి యాప్ లో అప్ లోడ్ చేయడాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. పనివాళ్లు రానప్పుడు కొన్ని సందర్భాల్లో ఫొటోలు అప్ లోడ్ చేయడం కోసం ఉపాధ్యాయులే మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. మధ్యాహ్న భోజనం క్వాలిటీ చెక్ చేయడం, నాడు నేడు పనుల పర్యవేక్షణ బాధ్యతలను కూడా ఉపాధ్యాయులకు అప్పగించారని, వాటి వల్ల బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నామని చాలా సందర్భాల్లో వారు ఫిర్యాదులు చేశారు. కానీ గత ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు, తనిఖీ బాధ్యత, ఫొటోల్ని అప్ లోడ్ చేసే బాధ్యత కూడా ఉపాధ్యాయులకే అప్పగించింది. కూటమి ప్రభుత్వం కొన్ని బాధ్యతలనుంచి వారిని తప్పిస్తోంది. తాజాగా మరుగుదొడ్ల ఫొటోలు యాప్ లో అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

First Published:  6 Aug 2024 5:20 PM IST
Next Story