Telugu Global
Andhra Pradesh

రెడ్ బుక్ పై నారా లోకేష్ క్లారిటీ..

మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకూడదా అని ప్రశ్నించారు నారా లోకేష్.

రెడ్ బుక్ పై నారా లోకేష్ క్లారిటీ..
X

రెడ్ బుక్ పై నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదే రెడ్ బుక్ అని చెప్పారాయన. రెడ్ బుక్ పట్టుకుని తాను ఊరూరా తిరిగానని, ప్రజలకు దాని గురించి వివరించానని, అది నచ్చే ప్రజలు తమకు ఓటు వేశారన్నారు. అంటే రెడ్ బుక్ ని ప్రజలు స్వాగతించారని, దానిలో నోట్ చేసిన వారందరికీ చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని, వారికి శిక్ష పడేలా చేస్తానని చెప్పారు నారా లోకేష్.


మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారని, అలాంటి తప్పులు చేసిన వారిని కూడా శిక్షించకూడదా అని ప్రశ్నించారు నారా లోకేష్. రేపు లిక్కర్ స్కామ్ పై కూడా చర్యలుంటాయని హింటిచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన ప్రతి కుంభకోణంపై విచారణ జరుగుతుందన్నారు నారా లోకేష్.

ఏపీలో రెడ్ బుక్ వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ పై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీ ధర్నాలో కూడా మాజీ సీఎం జగన్ రెడ్ బుక్ ని ప్రముఖంగా ప్రస్తావించారు. లోకేష్ చేతిలో రెడ్ బుక్ ఫొటోలతో పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్న వేళ, నారా లోకేష్ ఇలా క్లారిటీ ఇవ్వడం విశేషం. రెడ్ బుక్ లో పేర్లున్న వారందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

First Published:  16 Aug 2024 4:56 AM GMT
Next Story