Telugu Global
Andhra Pradesh

నేను జగన్ అంత లగ్జరీ కాదు -లోకేష్

మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.

నేను జగన్ అంత లగ్జరీ కాదు -లోకేష్
X

తాను జగన్ అంత లగ్జరీ కాదని, రుషికొండ ప్యాలెస్ కోసం ఆయన 500 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని, పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు 200 కోట్ల రూపాయలు జరిమానా కూడా కట్టారని ఆరోపించారు నారా లోకేష్. 'చినబాబు చిరుతిండి ఖర్చు..' అంటూ సాక్షి గతంలో ప్రచురించిన ఓ ఆర్టికల్ పై పరువునష్టం దావా వేసిన లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకి హాజరయ్యారు. ఆ కేసు విషయంలో సాక్షిని వదిలిపెట్టేది లేదన్నారు లోకేష్. మంత్రిగా ఉన్నా కూడా తానెప్పుడూ ప్రభుత్వ సొమ్ముని దుబారా చేయలేదని, కోర్టు కేసుకోసం విశాఖ వచ్చినా తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని ఉపయోగించుకోలేదని, కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని చెప్పారు లోకేష్.


మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్ముని సొంతానికి వాడుకున్నారని, తన మొహం కనిపించేలా హద్దురాళ్లను వేయించడానికి సిద్ధమయ్యారని, రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు నారా లోకేష్. ఈ క్రమంలో ఆయన సాక్షి మీడియాపై సెటైర్లు పేల్చారు. సాక్షి లోగోని పైకెత్తి చూపుతూ.. బ్లూ మీడియా అని అన్నారు. రెడ్ బుక్ విషయంలో సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం చెప్పారు. తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తాను పదే పదే చెప్పానని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. గతంలో తాను యువగళం యాత్ర చేయకుండా జగన్ జీవో తెచ్చారని, కానీ కూటమి ప్రభుత్వంలో జగన్ యథేచ్ఛగా ఎక్కడికంటే అక్కడకు వెళ్లగలుగుతున్నారని అన్నారు లోకేష్. రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు అమలులో లేదన్నారు.

ఆరు గ్యారెంటీల అమలుకి తాము కట్టుబడి ఉన్నామని, మెల్ల మెల్లగా అన్నీ అమలు చేస్తామని చెప్పారు నారా లోకేష్. తల్లికి వందనం కూడా త్వరలో అమలులోకి తెస్తామన్నారు. గతంలో పెన్షన్ ను వెయ్యిరూపాయలు పెంచేందుకు జగన్ ఐదేళ్లు టైమ్ తీసుకున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం నెలరోజుల వ్యవధిలోనే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచామని చెప్పారు లోకేష్. కంగారేం లేదని, అన్ని హామీలు అమలు చేస్తామన్నారాయన. తాజాగా ముంబై హీరోయిన్ వ్యవహారంలో వైసీపీ నేతల బండారం బయటపడిందని, అన్నిటిపై విచారణ జరిపిస్తామన్నారు లోకేష్.

First Published:  29 Aug 2024 5:38 PM IST
Next Story