ఫొటోలు తీసేస్తాం.. శిలాఫలకాలపై కొత్త రాజకీయం
గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
ఏపీలో ఎన్నికల తర్వాత చాలా చోట్ల శిలాఫలకాల ధ్వంసమయ్యాయి. వైరి వర్గం పేర్లు కనపడకూడదనే ఉద్దేశంతో టీడీపీ సానుభూతిపరులే శిలా ఫలకాలు కూల్చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో స్వయంగా టీడీపీ మంత్రి కూడా శిలాఫలాకాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. శిలాఫలకాలపై ఫొటోలు వెంటనే తీసివేయాలని ఆయన, సిబ్బందిని ఆదేశించారు.
గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. ప్రభుత్వం మారి నెలరోజులైనా, పథకాల పేర్లు మార్చినా అధికారుల్లో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ప్రకాశం జిల్లా పొదిలిలోని సామాజిక వైద్యశాలను తనిఖీ చేసిన మంత్రి.. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఫొటోలతో ఉన్న శిలాఫలకాన్ని గమనించారు. వారి సొంత నిధులు ఖర్చుపెట్టినట్లు ఫొటోలు కూడా శిలాఫలకాలపై వేయించుకున్నారని ఎద్దేవా చేశారు. వెంటనే వాటిని తొలగించి, ఆ స్థానంలో ప్రభుత్వ చిహ్నం ఉండేలా శిలాఫలకాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే పథకాల పేర్లు మారిపోతున్నాయి. 2019లో ఏం జరిగింతో.. 2024లో కూడా అదే రిపీట్ అవుతోంది. మా పథకాల పేర్లు తీసేసి, టీడీపీ పేర్లు పెట్టుకుంటోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మేం కొత్తగా చేసిందేమీ లేదు, గత పేర్లు కొనసాగిస్తున్నామని అధికార పార్టీ వివరణ ఇస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు శిలా ఫలకాల రాజకీయం మొదలైంది.