పేదలకు ఇళ్ల స్థలాలపై ఏపీ కేబినెట్ నిర్ణయం
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు పచ్చజెండా ఊపింది.
ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర మంత్రి పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను క్రమబద్దీకరించాడనికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ బ్యారెజ్ రైట్ సైడ్‌వాల్ నిర్మాణానికి రూ. 290 కోట్లు మంజూరికి కేబినెట్ ఆమోదం వ్యక్తం చేసిందన్నారు. ఇటీవల సేకరించిన ధాన్యానికి అవసరమయ్యే మరో రూ. 700 కోట్లు రుణాలను సేకరించడానికి ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 6,200 కోట్లు జమ చేశామని మంత్రి పేర్కొన్నారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణం, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వెంటనే ప్రారంభమవుతాయని సీఎం వెల్లడించారు.పేదలందరికీ ఇళ్ల పథకం లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం కేటాయిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన మార్గదర్శకాలను వెల్లడించారు. ‘వారు గతంలో ఎప్పుడూ ఇంటి కోసం లోన్ పొంది ఉండకూడదు. బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. కచ్చితంగా ఆధార్ ఉండాలి. మెట్ట ప్రాంతంలో 5 ఎకరాలు, మాగాణిలో 2.5 ఎకరాలు మించి ఉండకూడదు’ అని పేర్కొన్నారు.