సభకు రావొద్దంటే రాను... శాసన సభల్లో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుండగా ఉప సభాపతి అడ్డుకోవడంపై జ్యోతుల నెహ్రు అసహనం వ్యక్తం చేశారు. మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానన్నారు. శాసన సభకి రావద్దంటే రానని కఠినంగా మాట్లాడారు. కనీసం 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వకపోతే ఎలా అని జ్యోతుల ప్రశ్నించారు.అప్పటికే కొంత సమయం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రసంగిస్తుండగా కలగజేసుకున్న రఘురామ.. ‘నెహ్రూ సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. అర్థం చేసుకోవాలి.
ముగించండి’ అని అన్నారు. సారీ.. సారీ.. కూర్చోమంటే కూర్చుంటా అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. అయితే కూర్చోమని తాను అనడం లేదని, ప్రసంగాన్ని ముగించాలని మాత్రమే అంటున్నానని రఘురామ అన్నారు. ప్రతిస్పందించిన నెహ్రు.. తనను ప్రతిపక్షంగా చూడకండి అని పేర్కొన్నారు. “సార్… మీరు మాట్లాడడం మొదలుపెట్టి గడియారంలో 12 నిమిషాలు అయ్యింది. ఫినిష్ చేయమని అంటున్నాను అంతే” అని అన్నారు. అయితే పదికి పదిసార్లు తనను అడ్డుకోవడం చూస్తుంటే తనను ప్రతిపక్షంగా భావిస్తున్నట్టుగా ఉందని, అది సరికాదని నెహ్రూ తిరిగి రిప్లై ఇచ్చారు.