షర్మిల, విజయమ్మపై కోర్టులో జగన్ పిటిషన్.. ఆస్తుల కోసమేనా..?
ఆస్తుల వివాదంపై మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేశారు.
ఆస్తుల వివాదంపై వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. మొదట్లో చెల్లే అనే భావనతో షర్మిలకు వాటాలు కేటాయించాలని భావించానని అయితే ఇటీవల షర్మిల తనకు వ్యతిరేకంగా విమర్మలు చేయడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్, వైస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి రెడ్డి పేర్లతో ఈ ఏడాది ఐదు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్, జగన్ సొదరి వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు, అక్టోబర్ 18న మరో పిటిషన్‌ను జగన్మోహన్ రెడ్డి, షర్మిల రెడ్డి, క్లాసిక్ రియాల్టీ ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో దాఖలు చేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రయివేట్ లిమిటెడ్‌లో వైఎస్ జగన్‌కు షేర్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ కంపెనీలో షేర్ల వాటా పంపకాల విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతోనే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సరస్వతి కంపెనీ షేర్ల వివాదంలో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్ తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు.