Telugu Global
Andhra Pradesh

వెలిగొండ సంగతేంటి.. చంద్రబాబుకి జగన్ సూటి ప్రశ్న

సివిల్‌ వర్క్స్‌ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు జగన్. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

వెలిగొండ సంగతేంటి.. చంద్రబాబుకి జగన్ సూటి ప్రశ్న
X

వెలిగొండ ప్రాజెక్ట్ రెండు టన్నెళ్లు వైసీపీ హయాంలోనే పూర్తయ్యాయని, పునరావాసంపై కొత్త ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ పెట్టినట్టు కనపడ్డం లేదని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్. కరవుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడంపై చంద్రబాబు శ్రద్ధ చూపాలని కోరారు. రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ (ఆర్ అండ్ ఆర్) కోసం వైసీపీ హయాంలో అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామని, వాటిని అమలుని చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ జగన్ ట్వీట్ వేశారు.


2005లో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు జగన్. ఆయన కల తమ హయాంలో పూర్తయిందని, ఆర్ అండ్ ఆర్ మాత్రం పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సీజన్‌లోనే దానికోసం రూ.1200 కోట్లు చెల్లిస్తే, ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయవచ్చని సూచించారు. 2014–19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందిన్నారు జగన్. సివిల్‌ వర్క్స్‌ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు జగన్.

గండికోట విషయంలోనూ చంద్రబాబు అశ్రద్ధ చూశామన్నారు జగన్. తమ ప్రభుత్వ హయాంలో ఆ ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కోసం వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించామని, 27 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని గుర్తు చేశారు. చిత్రావతి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద రూ.250 కోట్లను గతంలో తమ ప్రభుత్వమే చెల్లించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు జగన్. ఎప్పుడో పూర్తయిన పులిచింతలకు కూడా తమ హయాంలోనే పునరావాస ప్యాకేజీ ఇచ్చామని అన్నారు. కృష్ణా వరదనీరు సముద్రంపాలవుతున్న ఈ సందర్భంలో వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విడుదల చేసి వెలిగొండ ప్రాజెక్ట్ లో నీరు నిల్వ చేయాలని డిమాండ్ చేశారు జగన్.

First Published:  19 Aug 2024 6:07 PM IST
Next Story