ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. నేడు మరో మీటింగ్
ఆగస్ట్ 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులెవరూ చేజారకూడదని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్ పెట్టారు. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ప్రకటించే క్రమంలో ఓసారి స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మరోసారి కీలక మీటింగ్ ఏర్పాటు చేశారు జగన్.
వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీకి నల్లేరుపై నడక. విశాఖ జిల్లాకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో వైసీపీకి క్లీన్ మెజార్టీ ఉంది. కానీ టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెడితే పరిస్థితిలో తేడా వస్తుంది. ఇప్పటికే కొందరు విశాఖ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి వెళ్లారు, ఎన్నికల వేళ ఫిరాయింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. టీడీపీ అధికారంలోకి ఉంది కాబట్టి, ఐదేళ్లు కూటమిదే అధికారం కాబట్టి ఫిరాయింపుల్ని ఎవరూ ఆపలేరు. అయితే వైసీపీ మాత్రం తమ నేతలెవరూ ప్రలోభాలకు లొంగరని, పార్టీని అంటిపెట్టుకునే ఉంటారని ధీమాగా చెబుతోంది. ఈ ధీమా ఎన్నికల వరకు ఉండాలంటే మధ్యలో జగన్ ఇలాంటి మీటింగ్ లు చాలానే పెట్టాల్సి ఉంటుంది.
ఆగస్ట్ 30న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా ఓటర్లుగా ఉన్న ప్రజా ప్రతినిధులెవరూ చేజారకూడదని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. క్యాంప్ రాజకీయాలకు తెరతీస్తేనే తమవైపు ఎవరున్నారు, ఎవరు కూటమివైపు వెళ్లాలనుకుంటున్నారో తేలిపోతుంది. క్యాంప్ రాజకీయాలను తట్టుకునే ఆర్థిక స్థోమత, పోల్ మేనేజ్ మెంట్ తెలిసిన వారు కాబట్టే వ్యూహాత్మకంగా బొత్సను అభ్యర్థిగా పెట్టారు జగన్. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే.. కూటమిపై అది తొలి విజయం అవుతుంది. రాబోయే రోజుల్లో వైసీపీ హవా పెరిగే అవకాశముంది. ఓడిపోతే, ప్రలోభాల పర్వం మొదలైందని చెప్పుకునే ఆప్షన్ వైసీపీకి ఉండనే ఉంది. తమ పార్టీ నేతలే ఓటర్లు కాబట్టి.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్నారు జగన్.