Telugu Global
Andhra Pradesh

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు -జగన్

ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగు -జగన్
X

వరుస ట్వీట్లతో మాజీ ముఖ్యమంత్రి జగన్, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం డిమాండ్ చేస్తూ ట్వీట్ వేసిన ఆయన 24 గంటల్లోగా మరో ట్వీట్ తో ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల ఇంకా ప్రీమియం జమకాలేదని, దానివల్ల రైతులకు ఉచిత పంటలబీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్.


రైతు బాగుంటేనే..

రైతు బాగుంటేనే, రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబుకి సూచించారు జగన్. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను వైసీపీ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్‌-మే నెలలో చెల్లించామని గుర్తు చేశారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లించి, ఆ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా విడుదల చేస్తుందని, ఈ చెల్లింపులు పూర్తయిన నెల రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందని చెప్పారు జగన్. ఈ పథకం ద్వారా 54.55 లక్షల మంది రైతులకు అండగా నిలిచామని, గతంలో ఎన్నడూలేని విధంగా రూ.7,802 కోట్లు వారికి అందించగలిగామని వివరించారు. బీమా విషయంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని కూడా ఆయన చెప్పారు. కానీ కొత్త ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఆయన నిలదీశారు. వెంటనే ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ వేశారు జగన్.

ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా మేలుకోవాలని, ఉచిత పంటల బీమా ప్రీమియంను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దానితోపాటు రైతు భరోసా సొమ్ము కూడా విడుదల చేయాలన్నారు. రైతు భరోసాను రూ.20వేలకు పెంచి అమలు చేస్తామని సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవాలన్నారు జగన్.

First Published:  11 Aug 2024 6:18 PM IST
Next Story