Telugu Global
Andhra Pradesh

అధ్వాన్న పాలన.. అసమర్థ ప్రభుత్వం

వంచన, గోబెల్స్ ప్రచారం.. ఇవే చంద్రబాబు దినచర్య అని అన్నారు జగన్. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని ఇప్పుడు సరికొత్త కథ చెబుతున్నారని మండిపడ్డారు జగన్.

అధ్వాన్న పాలన.. అసమర్థ ప్రభుత్వం
X

ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్. 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నడిపే అధ్వాన్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ధైర్యం చంద్రబాబుకి లేదన్నారాయన. సూపర్ సిక్స్, సూపర్ టెన్ పేరుతో ప్రజల్ని మోసం చేశారని, బడ్జెట్ ప్రవేశ పెడితే అసలు విషయం తేలిపోతుందని, అందుకే దాటవేస్తున్నారని మండిపడ్డారు జగన్.


ఏపీలో ప్రశ్నించే గొంతులే ఉండకూడదా అని నిలదీశారు జగన్. గతంలో ఎప్పుడూ లేనట్టు రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా తయారయ్యాయని అన్నారు. ప్రజలెవరూ రోడ్డుపైకి వచ్చి తమను ప్రశ్నించకూడదని, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల ధ్వంసాలు, దాడులతో ఏపీ దారి తప్పిపోయిందన్నారు.

వంచన, గోబెల్స్ ప్రచారం.. ఇవే చంద్రబాబుకి తెలిసిన సిద్ధాంతాలు అని అన్నారు జగన్. ముందుగానే చంద్రబాబు ఓ కథ సిద్ధం చేస్తారని.. ఆ కథను తన మీడియా సామ్రాజ్యంలో ముందుగా ప్రచారం చేస్తారని, దానిపై డిబేట్లు పెడతారని, అందరూ దాని గురించే మాట్లాడతారని, ఆ తర్వాత చంద్రబాబు చేసిందే కరెక్ట్ అనేలా ప్రచారం జరుగుతుందన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్ను పోటు పొడిచినప్పుడు ఇలానే చేశారని, బీజేపీతో కలిసినప్పుడు, ఆ పార్టీతో విడిపోయినప్పుడు కూడా ఇలాగే జరిగిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని ఇప్పుడు సరికొత్త కథ చెబుతున్నారని మండిపడ్డారు జగన్. అసెంబ్లీలో గవర్నర్ తో కూడా అన్నీ తప్పులు చెప్పించారని విమర్శించారు. శ్వేత పత్రాల పేరుతో మరిన్ని అబద్ధాలు ప్రచారంలోకి తెచ్చారన్నారు జగన్.

టీడీపీ సెటైర్లు..

జగన్ ప్రెస్ మీట్ పెట్టక ముందే టీడీపీ సోషల్ మీడియా నుంచి సెటైర్లు పడ్డాయి. 11.30 కు ప్రెస్ మీట్ అని ప్రచారం జరిగినా లైవ్ 12.10 గంటలకు మొదలైంది. ఈలోగా.. టీడీపీ అకౌంట్లు సెటైర్లు మొదలు పెట్టాయి. ఇక ప్రెస్ మీట్ కు కెమెరాలు తీసుకు రావొద్దంటూ జర్నలిస్ట్ లకు వైసీపీ సూచించడం కూడా ఆసక్తికరంగా మారింది.


First Published:  26 July 2024 6:58 AM GMT
Next Story