Telugu Global
Andhra Pradesh

కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే జగన్ పరిస్థితి ఏంటి..?

ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లోనే కోర్టుల్లో ఏళ్లతరబడి వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ ప్రతిపక్ష నేత హోదా విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది, ఆ లోగా 2029 వచ్చేస్తుందా..? అనేది వేచి చూడాలి.

కోర్టులో ఎదురుదెబ్బ తగిలితే జగన్ పరిస్థితి ఏంటి..?
X

వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. మూడు రాజధానులతో సహా ప్రతి విషయాన్నీ ప్రతిపక్షం కోర్టుల్లో సవాల్ చేసేది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా జగన్ కి న్యాయపోరాటాలు తప్పడంలేదు. మొదటి నెల నుంచే ఇది మొదలు కావడం విశేషం. ప్రతిపక్ష హోదాకోసం ఇప్పుడు జగన్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం తనకు ఆ హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేదని, కుదిరితే వారికి ఆదేశాలివ్వాలని, లేకపోతే మీరే ఆ హోదా ఇచ్చేయండి అంటూ జగన్ తన పిటిషన్ లో పేర్కొనడం విశేషం.

అసెంబ్లీలో సగం సీట్లకంటే ఎక్కువ గెల్చుకుంటే అధికార పక్షం. అయితే ప్రతిపక్షానికి అలాంటి లెక్కలేవీ లేవంటున్నారు జగన్. కావాలంటే గత చరిత్రలు చూడాలంటున్నారు. గతంలో కూడా ఆయన పలు ఉదాహరణలతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. ఇప్పుడు తన పిటిషన్ లో కూడా అవే ఉదాహరణలను పొందుపరిచారు. మరి వీటితో కోర్టు సంతృప్తి చెందుతుందా, జగన్ కి అనుకూలంగా తీర్పునిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ జగన్ కి అనుకూలంగా తీర్పు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. కూటమి వెటకారాలను ఐదేళ్లు భరించక తప్పదు, ఆ తర్వాత 2029లో ప్రజా తీర్పుతోనే అన్నిటికీ సమాధానం లభిస్తుంది.

జగన్ ప్రతిపక్ష హోదా అడిగిన ప్రతి సారీ టీడీపీ నుంచి జవాబులు రావడం లేదు. గతంలో జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల్ని మాత్రమే తమ జవాబు రూపంలో బయటపెడుతున్నారు. తాను తల్చుకుంటే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ ఆనాడు జగన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పటి తమ సమాధానం అంటున్నారు టీడీపీ నేతలు. అయితే ఆ వీడియోకి తమకి సంబంధం లేదన్నట్టుగానే వైసీపీ నేతలు ప్రవర్తించడం విశేషం. అప్పట్లో చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలను అని జగన్ అన్నారంటే.. దానికి ఏవో లెక్కలు ఉండే ఉంటాయి కదా, మరి ఆ లెక్కలు ఇప్పుడు పనిచేయవా అని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లోనే కోర్టులు సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నాయి. ఏళ్లతరబడి ఆ వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ ప్రతిపక్ష నేత హోదా విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది, ఆ లోగా 2029 వచ్చేస్తుందా..? అనేది వేచి చూడాలి.

First Published:  24 July 2024 3:59 AM GMT
Next Story