Telugu Global
Andhra Pradesh

45 రోజుల్లో 36 హత్యలు.. అసెంబ్లీలో తాడోపేడో

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయన్నారు జగన్. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

45 రోజుల్లో 36 హత్యలు.. అసెంబ్లీలో తాడోపేడో
X

ఈనెల 22నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ సమావేశాలకు జగన్ హాజరవుతారా, అసలు వైసీపీ తరపున ఎవరైనా సభకు వస్తారా అనే సందేహం ఇప్పటి వరకు ఉంది. కానీ వినుకొండ ఘటన ఈ సందిగ్ధాన్ని తొలగించింది. అసెంబ్లీకి హాజరై ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనను నిలదీస్తామంటున్నారు జగన్. గవర్నర్ ప్రసంగం సమయంలో తమ నిరసన తెలుపుతామని చెప్పారు.


45రోజుల్లో 36 హత్యలు..

ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ అమలులో లేదని, ఆటవిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు జగన్. కూటమి ప్రభుత్వంలో ఆస్తుల ధ్వంసం, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, అయినా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయన్నారు జగన్. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆస్తుల్ని ధ్వంసం చేశారని వివరించారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు జగన్. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెట్టడం దారుణం అని చెప్పారు.

రషీద్ ని చంపడంతోపాటు తప్పుడు కథలు ప్రచారంలోకి తెచ్చారని అన్నారు జగన్. రెండేళ్ల కిందట బైక్‌ కాలిన కేసులో.. ఇది ప్రతీకారంగా జరిగిందంటూ ఈనాడు ఓ కథనం ఇచ్చిందని, కానీ ఆ బైక్‌ ఆసిఫ్‌ అనే వ్యక్తిది అని తేలిందని చెప్పారు జగన్. మరి రషీద్ ని ఎందుకు చంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈనాడు అసలు పేపరేనా అని నిలదీశారు. ఇక్కడ ఎస్పీగా రవిశంకర్‌ ఉన్నారని, ఎన్నికల వేళ పలుకుబడితో ఆ ఎస్పీని మార్చేసి, మల్లికా గార్గ్‌ను నియమించారనని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఎస్పీని కూడా మార్చేశారని చెప్పారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్నారు.

తప్పుడు వాగ్దానాలతో అధికారం..

చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని అన్నారు జగన్. వైసీపీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికే రెండు దఫాలు విద్యా దీవెన అందేదని, వసతి దీవెన వచ్చేదని, రైతు భరోసా, అమ్మఒడి నిధులు జమ అయ్యేవని, మత్స్యకార భరోసా కూడా సకాలంలో అందేదని గుర్తు చేశారు. తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు 15వేల రూపాయలు ఆర్థికసాయం చేస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు జగన్.

First Published:  19 July 2024 8:11 PM IST
Next Story