Telugu Global
Andhra Pradesh

ఏపీలో భారీ వర్షాలు..తిరుమలలో కమ్ముకున్న పొగమంచు

ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం కారణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి

ఏపీలో భారీ వర్షాలు..తిరుమలలో కమ్ముకున్న పొగమంచు
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 48 గంటల్లో వాయుగండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చారించారు. ఏపీలో పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం కారణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా జలదంకి మండలంలో 17.7 సెం.మీ, నిడవలూరులో 17.3, అల్లూరులో 15.4, కావలిలో 15.1, కొడవలూరులో 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. బాపట్ల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.భారీ వర్షానికి దుద్దుకూరు దగ్గర యార వాగు ఉధృతి ప్రవహిస్తోంది. దీంతో ఒంగోలు-ఇంకొల్లు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. కుండపోత వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి.

కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.భారీ వర్షాల హెచ్చరికతో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలో విద్యాసంస్థలకు హాలీడే ప్రకటించారు. ప్రజలు, అధికారులు మూడ్రోజులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. తీరప్రాంతాల్లో గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.,మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. అయితే ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ తిరుమలను దట్టమైన పొగ కమ్మేసింది. శ్రీవారి సన్నిధితో పాటు ఆలయ పరిసరాలు అన్నీ మంచు దుప్పటి కప్పేసినట్లుగా మారింది.

First Published:  15 Oct 2024 12:24 PM GMT
Next Story