గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ.. ఈసారి ఏ పదవంటే!
గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ చోటు సంపాదించుకున్నారు.
మాజీ ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన గల్లా జయదేవ్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి 2024 వరకు రెండు సార్లు టీడీపీ నుంచి ఎంపీగా పనిచేశారు గల్లా. 2019లో వైసీపీ హవాలోనూ గుంటూరు ఎంపీగా వరుసగా రెండోసారి విజయం సాధించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో తన వ్యాపారాలకు ఇబ్బందులు ఎదురయ్యాయన్న ఆరోపణలు చేస్తూ ఇటీవలి ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు గల్లా జయదేవ్. తర్వాత కొద్ది రోజులకే ఏపీలో ఎన్నికలు జరగడం, తెలుగుదేశం కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఎన్నికల్లో గల్లా పోటీ చేయకపోవడంతో ఆయన స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఘన విజయం సాధించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ చోటు సంపాదించుకున్నారు.
ఈసారి పోటీ చేసి ఉంటే గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించడంతో పాటు.. కేంద్రమంత్రిగా ఉండేవారని, కానీ ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చర్చ నడిచింది. ఇప్పుడు గల్లా జయదేవ్‌లో అంతర్మథనం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు ఆయనకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. అంతే కాదు 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానానికి గల్లాను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.