Telugu Global
Andhra Pradesh

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు

నెయ్యి కల్తీ అయినట్టు ఆధారం చూపించండి : సుప్రీం కోర్టు

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు
X

దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం కోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినట్టుగా ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలసిన కల్తీ నెయ్యి ఉపయోగించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారని ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ లో కూడిన ధర్మాసనం విచారించింది. మొదట సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ అందుబాటులో లేకపోవడంతో విచారణను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. మధ్యాహ్నం ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలు విన్నది. తిరుమలలో శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి పరీక్షించడానికి నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయని సుబ్రమణ్య స్వామి తరపు అడ్వొకేట్‌ వివరించారు. కల్తీ జరిగిన నెయ్యి వందశాతం వాడలేదని స్వయంగా ఈవోనే చెప్పారని గుర్తు చేశారు. ఇష్టారీతిన మాట్లాడటంతో తీవ్ర పరిణాలు ఉంటాయి.. రాజకీయ కుట్రతో లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆలయ వ్యవహారాలు పూర్తిగా ఈవో, ట్రస్ట్‌ బోర్డు పర్యవేక్షణలోనే ఉంటాయి. ఈవోను ప్రభుత్వమే నియమించిందని తెలిపారు.

ధర్మాసనం జోక్యం చేసుకొని ల్యాబ్‌ రిపోర్టులు సరిగా లేవని, నెయ్యిని రిజెక్ట్‌ చేశామని ఈవో చెప్పారని వ్యాఖ్యానించింది. ఈ విషయాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌ లోనే ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు.. సీఎం మీడియాకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కదా.. ల్యాబ్ రిపోర్ట్‌ జూలైలో వస్తే ఆ విషయం సెప్టెంబర్‌ లో ఎందుకు చెప్పారు? సిట్‌ ఎందుకు ఏర్పాటు చేశారు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయ పరిచారు. నెయ్యిని రిజెక్ట్‌ చేసిన తర్వాత వాడే పరిస్థితే ఉండదు కదా అని ప్రశ్నించింది. తిరుమల లడ్డూపై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డీడీబీ) నివేదికపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి అడ్వొకేట్‌ అభ్యర్థించారు. ధర్మాసనం వరుస ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రభుత్వ న్యాయవాది సిద్ధార్థ్‌ లూద్రా ఇబ్బంది పడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, మందలింపు నేపథ్యంలో ఏపీలో అధికారపక్షం టీడీపీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇరుకున పడ్డట్టు అయ్యింది.

First Published:  30 Sept 2024 8:54 AM GMT
Next Story