Telugu Global
Andhra Pradesh

45 రోజుల్లో 36 హత్యలు.. వివరాలు కావాలన్న చంద్రబాబు

ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలున్నాయి.

45 రోజుల్లో 36 హత్యలు.. వివరాలు కావాలన్న చంద్రబాబు
X

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దారుణాలు, దుర్మార్గాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీలో దీక్షకు సైతం సిద్ధమయ్యారు ఆ పార్టీ నేతలు. ఏపీలో 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయంటూ సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. అయితే ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాస్తవాలు కావని టీడీపీ నేతలంటున్నారు. జగన్ బయటపెట్టిన గణాంకాలపై సీఎం చంద్రబాబు ఎంపీల మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. 36 హత్యలు జరిగాయని జగన్ ఆరోపణలు చేసిన వెంటనే.. టీడీపీ నుంచి ఎందుకు కౌంటర్ పడలేదని ఆయన సొంత పార్టీ నేతల్ని నిలదీసినట్టు చెబుతున్నారు. ఆ 36మంది వివరాలు అడిగితే వైసీపీ ఆరోపణల్లో నిజమెంతో తెలిసేది కదా అనేది చంద్రబాబు లాజిక్.

ఆ 36మంది ఎవరు..?

జిలానీ హత్య నడిరోడ్డులో అందరూ చూస్తుండగా జరిగింది. ఇది రాజకీయ హత్య అని వైసీపీ అంటోంది, వ్యక్తిగత కక్ష అని పోలీసులు తేల్చేశారు. మిగతా హత్యల విషయంలో ఈమాత్రం హైడ్రామా కూడా జరగలేదు. మరి 36మంది హత్యలు అని గాల్లో రాయి వేస్తే సరిపోతుందా అని టీడీపీ నేతలంటున్నారు. ఆ 36మంది పేర్లు, వివరాలు చెప్పాలని, అసలా హత్యలు ఎప్పుడు జరిగాయి, ఎలా జరిగాయో కూడా బయటపెట్టాలని అడుగుతున్నారు. వైసీపీ దీనికి సిద్ధంగా ఉందో లేదో చూడాలి.

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక 45 రోజుల వ్యవధిలో 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని కూడా ఆరోపించారు జగన్. టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఆస్తుల్ని కూడా ధ్వంసం చేశారని చెప్పారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయన్నారు. వీటన్నిటికీ ఇప్పుడు టీడీపీ లెక్కలు అడుగుతోంది. ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలున్నాయి.

First Published:  21 July 2024 2:04 AM GMT
Next Story