సీఐఐ కేంద్రంపై చంద్రబాబు కీలక ప్రకటన
టాటా సంస్థతో కలిసి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న ఏపీ సీఎం
దావోస్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ కీలక ప్రకటన చేశారు. సీఐఐ కేంద్రం ఏర్పాటుపై చంద్రబాబు స్పందించారు. టాటా సంస్థతో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతాం. భారత్ 2027 విజన్ మేరకు ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు.
రాజమన్నార్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ ఫౌండర్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాదిలో మాస్టర్ కార్డ్ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉందన్నారు. మాస్టర్ కార్డ్ కంపెనీ ప్రాధాన్యం అయిన ఫిన్ టెక్‌కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్‌ను తయారుచేయడానికి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మాస్టర్ కార్డు హెల్త్ కేర్ మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ మాట్లాడుతూ... తమ బోర్డు సభ్యులతో చర్చించి, ఏపీలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.