Telugu Global
Andhra Pradesh

ఊహించని ట్విస్ట్.. చంద్రబాబు బ్యాక్ స్టెప్

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేకపోతే ఈనెల 30న ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు.

ఊహించని ట్విస్ట్.. చంద్రబాబు బ్యాక్ స్టెప్
X

విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక దాదాపుగా ఖాయమైంది. ఈ ఎన్నికలకు కూటమి దూరంగా ఉండటంతో బొత్స విజయానికి ఎదురు లేకుండా పోయింది. అయితే ఈ పోటీ ఏకగ్రీవం అవుతుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజుతో నామినేషన్ల దరఖాస్తు గడువు ముగిసింది. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణతోపాటు, స్వతంత్ర అభ్యర్థిగా షేక్‌ షఫీ ఉల్లా నామినేషన్‌ దాఖలు చేశారు. రేపు(బుధవారం) నామినేషన్లు పరిశీలన జరగనుంది. ఆగస్టు 16 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఆ ఒక్క స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. లేకపోతే ఈనెల 30న ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లు లెక్కిస్తారు.

బాబు వెనకడుగు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రంగంలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారం వల్లే జగన్ కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నేతలకు టైమ్ కేటాయించి మీటింగ్ లు పెట్టారు. ఎక్కడా ఏ ఒక్కరూ చేజారకుండా చూసుకున్నారు. అందులోనూ బొత్స గట్టి అభ్యర్థి కావడంతో, క్యాంప్ రాజకీయాలకు కూడా ఆయన వెనకాడరని తేలిపోవడంతో టీడీపీ వెనుకంజ వేసింది. పది, ఇరవై మందిని తమవైపు తిప్పుకోవడం ఓకే, అధికారంలో ఉన్న పార్టీలు సహజంగా చేసేది అదే. కానీ వందల మందిని టీడీపీలోకి లాక్కుంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచే అవకాశముంది. అది సాధ్యం కాదని తేలిపోవడంతో ఎన్నికల బరినుంచి టీడీపీ తప్పుకుంది.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో.. అంటే ప్రస్తుత విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్‌ సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైసీపీ బలం 615 కాగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 215 ఓట్లు ఉన్నాయి.. 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

First Published:  13 Aug 2024 9:05 PM IST
Next Story