Telugu Global
Andhra Pradesh

బొత్స విజయం.. వైసీపీకి ఏమేరకు లాభం..?

చంద్రబాబు మెడలు వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.

బొత్స విజయం.. వైసీపీకి ఏమేరకు లాభం..?
X

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. పోటీలో ఉన్న ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్థి విరమించుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయితే ఈ విజయం వైసీపీకి ఏమేరకు లాభం చేకూరుస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు మెడలు వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తూ వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పడిపోయిన వైసీపీకి నెలల వ్యవధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఊరటనిచ్చేదే. అంతమాత్రాన ఈ విజయంతో ఏపీలో వైసీపీ ఫామ్ లోకి వచ్చేసిందని, ఇక తిరుగు లేదని, ఐదేళ్లు కళ్లు మూసుకుంటే 2029లో విజయం ఆ పార్టీదేనని అంచనా వేస్తే మాత్రం అమాయకత్వమే అవుతుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం ప్రజా ప్రతినిధుల తీర్పు. టీడీపీ కంటే ఇక్కడ 200కి పైగా ఓట్లు వైసీపీకి ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ నుంచి ఒత్తిడులు లేవు కాబట్టి, అసలా పార్టీ పోటీలోనే లేదు కాబట్టి వైసీపీ ఓట్లు చెక్కుచెదరలేదు. ఇది ఏకపక్ష విజయమే అయినా, ప్రజలు ఎక్కడా ఓటింగ్ లో పాల్గొనలేదు కాబట్టి.. ప్రజల్లో మార్పు వచ్చేసిందని అనుకోలేం. మరోవైపు ఈవీఎం ఓటింగ్ కాదు కాబట్టి తమదే విజయం అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేయడంలో కూడా అర్థం లేదు. 2029లో కూడా ఏపీలో ఈవీఎంలతోనే ఓటింగ్ జరుగుతుంది. అంతమాత్రాన ఈవీఎంలపై అనుమానంతో వైసీపీ పోటీకి దూరంగా ఉండలేదు కదా. బ్యాలెట్ బాక్స్ అయితేనే నామినేషన్లు వేస్తాం, లేకపోతే పోటీలో పాల్గొనం అని వైసీపీ నేతలు అనలేరు కదా.

తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీకి కచ్చితంగా ఈ విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అదే సమయంలో కూటమిపై ఇది ప్రభావం చూపుతుందనుకోలేం. బొత్స గెలవడం వల్ల శాసన మండలిలో వైసీపీకి కొత్తగా పెరిగే బలమేమీ ఉండదు. ఆల్రడీ కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్ లో ఉన్నారు. వారందరూ వెళ్లిపోతే బొత్స లాంటి ఒకరిద్దరు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు. అసలు శాసన మండలే రద్దు చేస్తానన్న జగన్, ఇప్పుడీ ఎన్నికల కోసం ఇంత ఆరాటపడటం ఎందుకంటూ టీడీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఎమ్మెల్సీగా అయినా చట్టసభలోకి రీఎంట్రీ ఇస్తున్నారనుకోవాలి.

First Published:  15 Aug 2024 9:08 AM IST
Next Story