Telugu Global
Andhra Pradesh

ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల.. రీసర్వే నిలిపివేత

రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.

ఏపీలో మరో శ్వేతపత్రం విడుదల.. రీసర్వే నిలిపివేత
X

వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కూటమి ప్రభుత్వం వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తోంది. సీఎం చంద్రబాబు తానే స్వయంగా ఈ వైట్ పేపర్లు రిలీజ్ చేస్తూ వైసీపీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా సహజవనరుల దోపిడీ అంటూ మరో శ్వేతపత్రం బయటపెట్టారు. జగన్ పాలనలో ఏపీలోని సహజవనరులన్నీ దోపిడీకి గురయ్యాయని, భూ ఆక్రమణలతో అసలైన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు చంద్రబాబు.

రీ సర్వే నిలిపివేత..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో, భూ సర్వే చేపట్టి సరిహద్దులను మార్చేశారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో భూకబ్జాల నివారణకు 'ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌'ను త్వరలోనే తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ లో ఈ చట్టం అమలులో ఉందని, ఏపీలో కూడా ఇది అమలైతే.. కబ్జాదారులకు కష్టాలేనని తేల్చి చెప్పారు. భూమిని కబ్జా చేసినవారు ఆభూమి వారిదేనని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు చంద్రబాబు. గతంలో వైసీపీ నేతలు లాక్కున్న భూములను తిరిగి బాధితులకు అప్పగిస్తామని ప్రకటించారు.

తమ దగ్గరున్న సమాచారం ప్రకారం ఐదేళ్ల వైసీపీ పాలనలో 1.75 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటి విలువ రూ.35,576 కోట్లు అని చెప్పారు సీఎం చంద్రబాబు. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలను బలవంతంగా లాక్కున్నారన్నారు. కాలనీలు వచ్చే ప్రదేశంలో వైసీపీ నేతలు ముందుగానే తక్కువ ధరలకు భూములు కొనేశారని, ఆ తర్వాత వాటిని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకు విక్రయించారని చెప్పారు. ఆ భూముల లెవెలింగ్‌ పేరుతో కూడా దోపిడీ జరిగిందన్నారు. తిరుపతిలో సెటిల్‌మెంట్లతో భూములు లాక్కున్నారని, మఠం భూములు కూడా దోచేశారని ఆరోపించారు చంద్రబాబు.

రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు. ఇడుపులపాయలో కూడా 600 ఎకరాల భూ దోపిడీ జరిగిందనే విషయాన్ని గతంలోనే తాము బయటపెట్టామన్నారు. భూములు, గనులు, ఎర్రచందనం, అటవీ సంపదను భారీ ఎత్తున దోచేశారని మండిపడ్డారు. భూ సర్వే పేరుతో మొత్తంగా రూ.653కోట్లు వృథా అయ్యాయని అన్నారు. ఆ లెక్కలన్నీ సరిచేస్తామన్నారు చంద్రబాబు.

First Published:  16 July 2024 7:53 AM IST
Next Story