ఇక వాట్సాప్‌లోనే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ఏపీలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు సీఎస్ విజయానంద్ వెల్లడించారు.
ఏపీలో జనన, మరణ ధృవీకరణ పత్రాలను త్వరలో వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ సీఆర్ఎస్ అమలుపై ఆర్టీజీఎస్ వేదికగా ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వాట్సాప్‌లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానాన్ని మొదట తెనాలిలో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. ఇంటిగ్రేషన్ సహా సాంకేతిక సవాళ్లను సైతం పరిశీలించనున్నామని ఆయన వివరించారు.
ఇలా ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని సులువుగా వారికి అందించేందుకు ఈ ప్రభుత్వం పలు సన్నాహకాలు చేస్తోంది. మరోవైపు గతేడాది డిసెంబర్ రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సహా వివిధ ధృవీకరణ పత్రాలను పొందడానికి వాట్సాప్‌ను ఉపయోగించే కొత్త వ్యవస్థను తీసుకు రానున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పౌరుల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడంతోపాటు ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిని పర్యవేక్షించడానికి ఏఐతోపాటు డీప్ టెక్ వంటి సాంకేతిక పరిజ్ఞానను వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు.