Telugu Global
Andhra Pradesh

స్మృతివనంపై దాడి.. ఎస్సీ కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు

ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

స్మృతివనంపై దాడి.. ఎస్సీ కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు
X

విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడి ఘటనపై నేడు వైసీపీ నేతలు జాతీయ ఎస్సీ కమిషన్ ని కలవబోతున్నారు. వైసీపీ ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ నందిగం సురేష్, కైలే అనిల్ కుమార్.. తదితర నేతలు ఢిల్లీలో ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

స్మృతివనంపై దాడి చేసి, జగన్ అనే పేరులోని అక్షరాలను కొంతమంది దుండగులు తొలగించారనేది అసలు వార్త. అయితే విగ్రహంపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి జరిగింది జగన్ పేరుపైనే అనేది టీడీపీ వాదన. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా.. అంబేద్కర్ స్మృతి వనానికి రక్షణ లేకుండా పోయిందని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో విధ్వంసం జరుగుతోందని అంటున్నారు వైసీపీ నేతలు. స్మృతివనంపై జరిగిన దాడిని దళితవర్గంపై జరిగిన దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందనేది వైసీపీ ఆరోపణ. ఈ క్రమంలో కూటమి నేతలు రాజ్యాంగ కర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని అవమానించారని, ఆయన రాజ్యాంగంపై వారికి నమ్మకం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు టీడీపీ నుంచి ఎలాంటి సమాధనం లేదు. టీడీపీలోని కొందరు దళిత నేతలు మాత్రం దాడి జరిగింది జగన్ నేమ్ ప్లేట్ పై అయితే, అంబేద్కర్ విగ్రహంపై దాడి అంటూ వైసీపీ ఈ ఘటనను పక్కదారి పట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.

First Published:  14 Aug 2024 11:19 AM IST
Next Story