Telugu Global
Andhra Pradesh

టార్గెట్ రోజా.. ఆడుదాం ఆంధ్రాపై ఆరోపణలు

ఆడుదాం ఆంధ్రా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ అవినీతికి మాజీ మంత్రి రోజాని బాధ్యురాలిగా చేసే అవకాశాలున్నాయి. పక్కా ఆధారాలతో తమ ఆరోపణలను నిరూపించి రోజాపై విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

టార్గెట్ రోజా.. ఆడుదాం ఆంధ్రాపై ఆరోపణలు
X

ఎన్నికల ఏడాదిలో గత వైసీపీ ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో.. రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల ఏపీలో క్రీడాకారులకు జరిగిన మేలు ఏంటి..? క్రీడా ప్రాంగణాలకు జరిగిన ఉపయోగం ఏంటి అనే విషయం పక్కనపెడితే.. జగనన్న క్రికెట్ కిట్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ కార్యక్రమంపై అప్పట్లోనే విమర్శలు వినిపించాయి. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం కంటే.. ఆ నిధులతో రాష్ట్రంలోని క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయొచ్చు కదా అనే ప్రశ్నలువినపడ్డాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం 'ఆడుదాం ఆంధ్రా'పై ఎంక్వయిరీ మొదలు పెట్టింది. 40రోజుల్లో 120కోట్ల రూపాయలు వృథా చేశారని అంటున్నారు రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి.

క్రీడల శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి.. ఆడుదాం ఆంధ్రా విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అవినీతికి మాజీ మంత్రి రోజాని బాధ్యురాలిగా చేసే అవకాశాలున్నాయి. పక్కా ఆధారాలతో తమ ఆరోపణలను నిరూపించి రోజాపై విచారణ చేపట్టే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోజా రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కూడా ఆమె హాజరు కాలేదు. రాష్ట్రంలో వైసీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగానే ఉంటున్నారు. మరి ప్రభుత్వం చేసిన తాజా ఆరోపణలపై రోజా స్పందిస్తారో లేదో చూడాలి.

వైసీపీ హయాంలో క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, ఉద్యోగాలకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌)లో కూడా అక్రమాలు జరిగాయని అంటున్నారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. ఈ అక్రమాల ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. ‘శాప్‌’లో జరిగిన సర్టిఫికెట్ల కుంభకోణాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఓ కమిటీ వేస్తామని చెప్పారాయన. ఐదేళ్లలో రాష్ట్రాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనుమతులు లేని స్పోర్ట్స్ అకాడమీలపై చర్యలు తీసుకుంటామని, రాష్ట్రానికి ఐపీఎల్‌ క్రికెట్‌ టీమ్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి మండిపల్లి.

First Published:  13 Aug 2024 7:46 AM IST
Next Story