కుటుంబ బాధ్యతలకోసం మహిళలు ఉద్యోగాలను వదిలేస్తున్నారు...

ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 57శాతం మంది కుటుంబ బాధ్యతల వలన బలవంతంగా తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని కేరళలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.

Advertisement
Update:2023-07-08 14:38 IST

ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో 57శాతం మంది కుటుంబ బాధ్యతల వలన బలవంతంగా తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని కేరళలో నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. కేరళ నాలెడ్జ్ ఎకానమీ మిషన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేరళలో వివిధ ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న మహిళలు కుటుంబంలోని పిల్లలు, వృద్ధుల సంరక్షణ బాధ్యతలవలన ఉద్యోగాలను వదులుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇటీవల నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం ... మొత్తం పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య విషయంలో కేరళ దక్షిణభారతదేశపు పెద్ద రాష్ట్రాల్లో చివరన ఉంది. 57శాతం మంది మహిళలు బలవంతంగా తాము చేస్తున్న వృత్తి ఉద్యోగాలను కుటుంబ బాధ్యతకోసం వదులుకుంటుండగా వీరిలో కొద్ది శాతం మంది వివాహం తరువాత అత్తింటి తరపువారి అభిప్రాయం మేరకు లేదా వివాహం వలన వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావటం వల్లనో ఉద్యోగాలను వదులుకుంటున్నారని తెలుస్తోంది. కుటుంబ బాధ్యతల వలన ఉద్యోగాలు వదిలేస్తున్నవారిలో ఎక్కువమంది 30-34 సంవత్సరాల మధ్య వయసు వారే.

కేరళలో వెల్లడైన సర్వే వివరాలను బట్టి మహిళలు పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతల విషయంలో ఎంత కీలకంగా ఉన్నారో తెలుస్తుంది. జాతీయ గణాంకాల కార్యాలయం చెబుతున్న దాన్ని బట్టి మహిళలు తమ రోజువారి ఇంటి పనులకోసం రోజుకి ఏడుగంటలకు మించి సమయం వెచ్చిస్తున్నారు. అయితే మగవారు మాత్రం తమ భార్యలు ఇంటి పనులకోసం ఖర్చుచేస్తున్న సమయంలో సగం సమయం కూడా కుటుంబ బాధ్యతలకు ఇవ్వటం లేదు. ఇక్కడ మరొక విచిత్రమైన విషయం కూడా ఉంది. కేరళలో 52.3 శాతం మంది మహిళలు ఉన్నత విద్యలకు వెళుతున్నారు. కాగా ఉన్నత విద్యకోసం తమ పేర్లను నమోదు చేసుకుంటున్న మగవారి సంఖ్య 34.5 శాతంగా ఉంది. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉన్న మహిళల శాతం ఇక్కడ 17శాతంగా ఉంది.

తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం తెలంగాణలో 39శాతం మంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు. మణిపూర్ 40శాతంతో, మేఘాలయ 42శాతంతో తెలంగాణకంటే ముందున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న మహిళల సంఖ్య 37శాతం. మహిళల్లో 93శాతం మంది వ్యవసాయేతర రంగాల్లో పనిచేస్తున్నారు. కాగా మగవారిలో 64శాతం మంది వ్యవసాయేతర రంగాల్లో ఉన్నారు. 15-49 మధ్య వయసున్న మహిళలు ఎక్కువమంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కుటుంబ బాధ్యతల కారణంగా 58శాతం మంది మహిళలు ఉద్యోగాలను వదిలేసినట్టుగా తెలుస్తోంది. తమకు సరైన గుర్తింపు లేని కారణంగా కూడా మహిళలు ఉద్యోగాలు మానేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.

ఒకసారి ఉద్యోగం వదిలేసిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అవకాశాలు సైతం మహిళలకు తక్కువగా ఉంటున్నాయని, జాబ్ లు వదిలేసినవారిలో 70శాతం మంది మహిళలు ఈ విధంగా బాధపడుతున్నారని మరొక సర్వేలో తేలింది. తిరిగి జాబ్ లో చేరేందుకు మళ్లీ ఇంతకుముందులా వారు తమ ఉద్యోగపరమైన నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి రావటం, మానేసిన సమయంలో జరిగిన సాంకేతిక మార్పులను, అభివృద్ధిని అర్థం చేసుకోవాల్సిన అవసరం లాంటివి మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరకుండా అడ్డుకుంటున్నాయి.

తాజాగా విడుదలైన నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదిక ప్రకారం పిల్లల సంరక్షణ లేదా కుటుంబ బాధ్యతల కారణంగా భారతదేశంలో గుర్తించదగిన స్థాయిలో వ్యక్తులు వృత్తి ఉద్యోగాలను వదిలేస్తున్నారు. మహిళలు మరింతగా ఈ కారణాలతో ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. 2020-21 లో జాబ్ లో లేని స్త్రీలలో 98.16 శాతం మంది తాము ఉద్యోగాలు వదిలేయడానికి పిల్లలు, కుటుంబ బాధ్యతలే కారణమని తెలుపగా, 2021-22లో 99.06 శాతం మంది మహిళలు ఇదే మాట చెప్పారు.

పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతల ప్రభావం మగవారిపైన కూడా పడుతోంది. అయితే అది చాలా తక్కువగా ఉంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ నివేదికని బట్టి 2020-21లో 1.81 శాతం మంది మగవారు మాత్రమే పిల్లల సంరక్షణ కుటుంబ బాధ్యతల వలన ఉద్యోగాలు చేయలేకపోతున్నామని చెప్పగా, ఆ సంఖ్య 2021-22 నాటికి 0.94శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 65శాతం మంది మహిళలు ఈ కారణాలతో పనిని వదిలేస్తుండగా, పట్టణాలలో 35శాతం మంది స్త్రీలు పిల్లలు, కుటుంబ బాధ్యతలకోసం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. కుటుంబ బాధ్యతల విషయంలో మహిళలు ఎంత కీలకమో మనందరికీ తెలుసు. గణాంకాలు సైతం అదే చెబుతున్నాయి. అయినా వారు తమకంటూ ఉపాధిని, ఆదాయాన్ని, గుర్తింపునీ పొందడానికి ఎంతో కృషి చేస్తూనే ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News