జగన్ తరపున విజయమ్మ ప్రచారం..! ఎల్లో మీడియా వంటావార్పు
చంద్రబాబు ఫోన్ కాల్స్ వివరాలు ఆంధ్రజ్యోతికి తెలిశాయంటే అందులో అర్థముంది, కానీ సాక్షాత్తూ సీఎం జగన్ ఫోన్ కాల్ రికార్డింగ్ లను కూడా ఎల్లో మీడియా సేకరించినట్టు చెప్పుకోవడం ఈ ఎపిసోడ్ కి పరాకాష్ట.
గతంలో ఎవరి డబ్బా వారు కొట్టుకునేవారు. ఓ వర్గం మీడియా తమ అనుకూల పార్టీలకు భజన చేసేది, వైరి వర్గంపై విమర్శలు చేసి సరిపెట్టేది. కానీ ఇప్పుడు వైరి వర్గం వార్తల్ని వండి వార్చడం ఎల్లో మీడియా ప్రధాన కర్తవ్యం. అందులోనూ అసలు వ్యక్తులకు కూడా తెలియని విషయాల్ని ఆంధ్రజ్యోతిలో చూసినట్టే రాసేస్తుంటారు, విన్నట్టే కథనాల్ని సిద్ధం చేస్తుంటారు. అలాంటి 'కథ'నాల్లో 'దిమ్మ తిరిగి అమ్మ ఒడికి!..' అనేది తాజా వంటకం.
షర్మిల దెబ్బతో జగన్ భయపడి తల్లి విజయమ్మకు ఫోన్ చేసినట్టు, ఆమె వెంటనే వైసీపీ తరపున ప్రచారానికి వస్తానన్నట్టు ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. అక్కడితో ఆగితే పర్లేదు, విజయమ్మకు ఫోన్ చేసి జగన్ ఏమేం మాట్లాడారనే విషయాలను కూడా ఆ కథనంలో వివరించడం కొసమెరుపు. పోనీ చంద్రబాబు ఫోన్ కాల్స్ వివరాలు ఆంధ్రజ్యోతికి తెలిశాయంటే అందులో అర్థముంది, కానీ సాక్షాత్తూ సీఎం జగన్ ఫోన్ కాల్ రికార్డింగ్ లను కూడా ఎల్లో మీడియా సేకరించినట్టు చెప్పుకోవడం ఈ ఎపిసోడ్ కి పరాకాష్ట.
విజయమ్మకి ఫోన్ చేసిన జగన్.. షర్మిల విషయంలో తాను భయపడుతున్నట్టు చెప్పారట. తాను ఓడిపోతే జైలుకెళ్లాల్సి వస్తుందని, ఎలాగైనా తనవైపు ఉండాలని తల్లిని వేడుకున్నారట. జగన్ మాటలకు కరిగిపోయిన విజయమ్మ ఏపీలో ప్రచారానికి వస్తానన్నారట. షర్మిల వారించినా ఆమె తన కొడుకువైపు ఉండేందుకు నిర్ణయించుకున్నారట. ఇదీ ఆ కథనం సారాంశం. ఒకవేళ ఏపీలో విజయమ్మ వైసీపీ తరపున ప్రచారం చేసినా.. మేము ముందే చెప్పామంటూ డబ్బాలు కొట్టుకుంటుంది ఆంధ్రజ్యోతి. అందుకే ముందుగానే ఈ కథనం వండి వార్చింది. తమదైన శైలిలో మసాలా దట్టించింది.