హరీష్ రావు వ్యాఖ్యలతో ఎల్లో మీడియాకు పండగ

ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు..? అందులో అంత నిగూడార్థం ఏముంది..? దాన్ని ఎల్లో మీడియా తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంది..?

Advertisement
Update:2023-10-28 07:14 IST

హరీష్ రావు వ్యాఖ్యలతో ఎల్లో మీడియాకు పండగ

బీఆర్ఎస్ చేరికల మీటింగ్ లో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలతో ఎల్లో మీడియా పండగ చేసుకుంటోంది. చంద్రబాబు గొప్పతనాన్ని, జగన్ అసమర్థతను హరీష్ రావు పరోక్షంగా ప్రస్తావించారంటోంది. హరీష్ రావు లాంటివారే చెప్పారంటే ఏపీలో పరిస్థితి ఎలా ఉందో సామాన్యజనం అర్థం చేసుకోవచ్చని చెబుతోంది. ఇంతకీ హరీష్ రావు ఏమన్నారు..? అందులో అంత నిగూడార్థం ఏముంది..? దాన్ని ఎల్లో మీడియా తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంది..?

"మళ్లీ కేసీఆర్‌ రాకపోతే హైదరాబాద్‌ కూడా అమరావతిలా అయిపోతుందని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అనుకుంటున్నారు. నేడు అమరావతిలో ఏమైంది? మొత్తం బిజినెస్‌ అవుట్‌." అంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఏపీలో కూడా చర్చకు దారితీశాయి. అమరావతి విషయంలో హరీష్ రావు పరోక్షంగా చంద్రబాబు శ్రమను ప్రశంసించారని, అదే సమయంలో జగన్ రావడంతో ఆ శ్రమ బూడిదపాలు అయిందని విమర్శించారని ఎల్లో మీడియా వ్యాఖ్యానాలు జతచేస్తోంది. అమరావతికి ఈ దుస్థితి పట్టడానికి జగనే కారణం అని మరోసారి నిందలు వేస్తోంది. మూడు రాజధానుల పేరుతో జగన్ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేకపోయారని అంటోంది.


జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్ కి స్థానం లేదు..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అన్నారు మంత్రి హరీష్ రావు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఖాతా తెరవదని చెప్పారు. బీఆర్ఎస్, పాతబస్తీలో మజ్లిస్ పార్టీలకు మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉందన్నారు. గ్రేటర్ పరిధిలోని ఎందరో కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ లో చేరుతున్నారని, వారందరికీ పార్టీలో సముచిత గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ మాజీ కార్యదర్శి సోమశేఖర్‌ రెడ్డి, ఆయన భార్య కార్పొరేటర్‌ శిరీష, ఉద్యమనేత గోపాల్‌ సహా పలువురు నేతల్ని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఈ సభలోనే ఆయన అమరావతి ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి మరింతగా పెరిగిందని, అందుకే చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊహకు అందని రీతిలో వృద్ధి చెందిందన్నారు. తిరిగి కేసీఆర్ గెలిస్తేనే ఈ అభివృద్ధి నిలబడుతుందని, లేకపోతే అమరావతికి పట్టిన గతే హైదరాబాద్ కి కూడా పడుతుందని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News