గందరగోళంగా గ్రామసభలు
ఆరు గ్యారెంటీలు, రేషన్ కార్డుల కోసం ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తన్న ప్రజలు
ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామాల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఇది కొనసాగనున్నాయి. అయితే ఆరు గ్యారెంటీలు, రేషన్ కార్డుల కోసం ప్రజలు అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్న సభల్లో అధికారులకు, ప్రజల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. సూర్యపేట ఇల్లా మోత మండలం సిరికొండ గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు రాలేదని అధికారులను నిలదీశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో గ్రామసభలో ఆరు గ్యారెంటీలపై అధికారులను నిలదీశారు. రెండు లక్షల రుణమాఫీ కాలేదుని, తులం బంగారం ఇవ్వలేదని, రైతు భరోసా ఇంతవరకు జాడ లేదని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వెంకటరెడ్డి పల్లి గ్రామసభలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు ఆత్మీయ రైతు భరోసా జాబితాలో లేవని అడిషనల్ కలెక్టర్ ముందు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డు సభల నిర్వహణ కనిపించడం లేదు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం వార్డు సభలు మొదలు కాలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లబ్ధిదారులను గుర్తించడానికి అధికారుల సర్వే ఇంకా పూర్తి కాలేదు. గ్రేటర్‌లో సర్వే పూర్తయ్యాక ఫిబ్రవరి 1 నుంచి వార్డు సభలకు సన్నాహాలు చేస్తున్నారు.