దేశంలో అత్యంత సంపన్నురాలైన మహిళ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఆమె తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే!

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా పేరిట రూ.97.36 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

Advertisement
Update:2023-07-21 15:20 IST

దేశంలో అత్యంత సంపన్నురాలైన మహిళ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? ఆమె తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తే!

దేశంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలలో అత్యంత సంసన్నులు ఎవ‌రు అనే అంశంపై ఇటీవల ఒక జాతీయ పత్రిక సర్వే చేసింది. ఎన్నికల సమయంలో ఆయా ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారి ఆస్తులను లెక్కకట్టింది. ఏపీకి చెందిన వైసీపీ మంత్రి విడుదల రజని దేశంలోని ఎమ్మెల్యేలలోనే అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్న విడుదల రజని వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.128 కోట్లు. తన ఆస్తిలో అత్యధిక ఆదాయం ఆమె భర్తకు చెందిన యూఎస్ బేస్డ్ సంస్థ ద్వారానే వస్తుందని రజని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే రివాబా జడేజా పేరిట రూ.97.36 కోట్ల ఆస్తులు ఉన్నాయి. భర్త రవీంద్ర జడేజా ద్వారానే తనకు ఆస్తులు సంక్రమించినట్లు, అలాగే హిందూ అవిభాజ్య కుటుంబ ఆస్తులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. గోవాకు చెందిన ఎమ్మెల్యే డెలియా లోబోకు రూ.92.91 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె గోవాలోనే ధనికురాలైన ప్రజాప్రతినిధిగా పేరుగాంచారు. డెలియా, ఆమె భర్త పేరెన్నికగన్న వ్యాపారులు. అలా డెలియాకు ఆస్తులు సంక్రమించాయి.

ఇక పంజాబ్ ఎమ్మెల్యే నైనా సింగ్ చౌతాలాకు రూ.91.79 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నైనా సింగ్ మామయ్య పంజాబ్ మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా, ఆమె భర్త మాజీ ఎంపీ అజయ్ సింగ్ చౌతాలా. వీరి కుటుంబం ద్వారా నైనా సింగ్‌కు భారీగా ఆస్తులు సంక్రమించాయి. ఇక దేశంలో అత్యంత తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యేగా పంజాబ్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే నరీందర్ కౌర్ భరాజ్ గుర్తింపు పొందారు. ఆమె ఆస్తి కేవలం రూ.24వేలు మాత్రమే.

దేశంలో అత్యల్ప సంఖ్యలోనే మహిళా ఎమ్మెల్యేలు...

దేశవ్యాప్తంగా మహిళా ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అత్యధికంగా త్రిపుర, వెస్ట్ బెంగాల్‌లో మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆయా అసెంబ్లీల్లో పురుష ఎమ్మెల్యేలతో పోలిస్తే వారి సంఖ్య వరుసగా 15, 14 శాతాలుగా మాత్రమే ఉన్నది. ఇటీవలే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అక్కడ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 4 శాతం మాత్రమే. ఇక మిజోరాంలో అయితే ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేకపోవడం గమనార్హం. తెలంగాణ, తమిళనాడు, హిమాచల్‌ప్రదేవ్, నాగాలాండ్, పుదుచ్చేరి, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 5 శాతం కూడా లేదు.

దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎమ్మెల్యేలలో 37 శాతం మంది బీజేపీకి చెందిన వారు. అయితే అదే పార్టీలోని పురుష ఎమ్మెల్యేల సంఖ్యతో పోలిస్తే.. వీరి సంఖ్య 9 శాతం మాత్రమే. కాంగ్రెస్ పార్టీలో 61 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్లు కూడా పురుషుల సంఖ్యతో పోలిస్తే 9 శాతం మాత్రమే. రాష్ట్ర అసెంబ్లీ, దేశ పార్లమెంటులో మహిళల ప్రాతినిథ్యం తగ్గుతూ రావడంపై అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక ఆమోదం పొందితే ఈ పరిస్థితిలో మార్పు రావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. లోక‌సభ, అసెంబ్లీల్లో 33 శాతం మంది మహిళా ప్రజాప్రతినిధులు ఎన్నికవడానికి అవకాశం ఇవ్వనున్న ఈ బిల్లు 2010 నుంచి పెండింగ్‌లో ఉన్నది. ఇప్పటికైనా ఆ బిల్లుకు మోక్షం కలిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News