వచ్చి వారం రోజులు కాలే.. దమ్ముందా అని మాట్లాడుతరా?

పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పై మధుసూదనాచారి ఆగ్రహం

Advertisement
Update:2024-09-20 15:54 IST

మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పీసీసీ అధ్యక్షుడు అయి వారం రోజులు కూడా కాలేదని.. అప్పుడే దమ్ముందా అని మాట్లాడటం ఏమిటని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌ లో మాజీ మంత్రి జోగు రామన్న, పార్టీ నాయకుడు పల్లె రవికుమార్‌ గౌడ్‌ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడికి పలుకుబడి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ అమలు చేసేలా సీఎంపై ఒత్తిడి తేవాలన్నారు. ఆయన బీఆర్‌ఎస్‌ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. నిఖార్సయిన కాంగ్రెస్‌ వాది వీహెచ్‌ను కాకుండా అన్ని పార్టీలు తిరిగి వచ్చిన రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ సీఎం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. బీసీ డిక్లరేషన్‌ అమలు కోసం జరుగుతోన్న పోరాటంలోనే మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కు పీసీసీ వచ్చిందనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏటా బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ ఇస్తామని చెప్పి.. అందులో సగం కూడా కేటాయింపులు చేయలేదన్నారు. ఆర్థిక సంవత్సరం పూర్తయితే కాంగ్రెస్‌ బండారం బయట పడుతుందన్నారు. దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్‌ పార్టీ బీసీ గణన ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. కేవలం ఓట్ల కోణంలోనే బీసీలను చూసిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌ అమలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పోరాడుతుందన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ 2004లోనే అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కు లేఖ రాశారని గుర్తు చేశారు. రాజకీయంగా కేసీఆర్‌ బీసీలకు ఎన్నో అవకాశాలిచ్చారని, రెండు చట్టసభల్లో అత్యున్నత పదవులను బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ దే అన్నారు.

సాగర్‌ ఎడమ కాలువకు ఎందుకు రిపేర్లు చేస్తలేరు

నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు ఎందుకు రిపేర్లు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ప్రశ్నించారు. మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ తో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రాజెక్టుల కాల్వలు దెబ్బతిన్నాయని, వాటికి రిపేర్లు చేయాలని కోరారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనూ రిపేర్లు చేయడం లేదన్నారు. ప్రజలను గాలికొదిలేసి మంత్రి కుటుంబం విహారయాత్రలు చేస్తోందన్నారు. కనీసం వరద బాధితులకు సాయం చేయడం లేదని మండిపడ్డారు. సీఎం, మంత్రులు పదవులను సోకుగా భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు సమయానికి రైతుబంధు వచ్చేదని, ఇప్పుడు సీజన్‌ అయిపోతున్నా రైతులకు సాయం చేయడం లేదన్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయని, మళ్లీ ఫ్లోరైడ్‌ భూతం పడగ విప్పే ప్రమాదముందని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News