తెలంగాణలో ఆర్-ఆర్ టీం హిట్టయ్యేనా.!?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు దారికడ్డంపడుతున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏ ధైర్యంతో దూసుకపోతున్నారు? ఆయనకు రాహుల్ గాంధీ అన్ని రకాల మద్దతు ఇస్తున్నారా ?
వర్షాకాలంలో కూడా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ లో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార కాంక్షతో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తూ పాలకపార్టీ టిఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తోంది. ముఖ్యమంత్రి తనదైన శైలిలో బిజెపి విమర్శలను తిప్పికొడుతూ ఆ పార్టీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రం తామే ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో గట్టిగానే కృషి చేస్తోంది.
కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ పోరాటం ఆసక్తి కలిగిస్తోంది. డాక్టర్ రాజశేఖర రెడ్డి మరణంతోనే ఆ పార్టీ రాష్ట్రంలో వెనకబాట పట్టింది. ఆ తర్వాత కెసిఆర్ నిరాహార దీక్ష తదితర పరిణామాల్లో రాష్ట్ర విభజన జరిగి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 2014 తర్వాత నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వరుస ఓటములు చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక మనుగడ లేదని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది అధిష్టానం. అప్పటివరకు స్తబ్దుగా ఉన్న పార్టీలో ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్టయింది. తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగానే రేవంత్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
పాత కొత్త తరం నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే క్రమంలో రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు, ఎదురు దాడి ఎదుర్కొంటున్నారు. అయినా వెనక్కి తగ్గకుండా తాను అనుకున్న విధానంలో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటినుంచే తగిన అభ్యర్ధులను గుర్తించి ఎంపిక చేసుకోవడంలోనూ, ఆయా ప్రాంతాల్లో చురుకుగా ఉన్న నేతలను గుర్తించి ప్రోత్సహించడంలోనూ ముందున్నారు. పాత లేక సీనియర్ నాయకులను పట్టించుకోవడంలేదని, టిక్కెట్ల విషయంలో కూడా ఆయనే పై చేయి సాధించాలనే ఆలోచనతో వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు.
రేవంత్ కు ఇంత ధైర్యం ఎలా వచ్చింది..
పార్టీలో తమకు తిరుగులేదని, తామే సీనియర్లం అని చెప్పుకునే వారిని సైతం పక్కనబెట్టి రేవంత్ దూకుడుగా వ్యహరించడం వెనక కారణాలు ఏమిటి అని కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. దీనికంతటికీ అగ్రనేత రాహుల్ గాంధీయే కారణమని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ముందునుంచీ యువతరాన్ని ప్రోత్సహించాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆలోచనలతో వస్తున్న యువతరంతో పార్టీని ఉరకలెత్తించాలని భావించారు. అందుకు సీనియర్లను సలహాలు ఇచ్చేందుకు, వెనక ఉండి ప్రొత్సహించేందుకే పరిమితం చేయాలని రాహుల్ గాంధీ భావించారు. అప్పట్లో అది పెద్ద దుమారం గా మారింది. అయినా రాహుల్ గాంధీ ఆలోచనలు అమల్లోకి రాలేదు. దాని ఫలితాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ప్రస్పుటంగా కనిపించాయి కూడా.
ఆర్-ఆర్ అంటే..?
2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. దీని ప్రకారం రేవంత్ కు పీసీసి పట్టం కట్టారు. దాదాపుగా రేవంత్ కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టే ఇటీవల పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. దీనినే రాహుల్-రేవంత్ (ఆర్-ఆర్) స్కీం గా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు రేవంత్, రాహుల్ తో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రంలో తాను అనుసరిస్తున్న ప్రణాళికలను రాహుల్ కు వివరిస్తూ ఆయన అనుమతులు ఆశీస్సులు తీసుకునే ముందుకు వెళుతున్నారని పార్టీలో చెప్పుకుంటున్నారు.
ఈ క్రమంలో వరంగల్ సభకు రాహుల్ ను ఆహ్వానించి రైతు డిక్లరేషన్ ను చేయించి సభను విజయవంతంగా నిర్వహించారు రేవంత్. రాహుల్ కూడా ఎంతో ఉత్సాహాన్ని కనబర్చారు. ఈ కార్యక్రమం ఇచ్చిన ఊపుతో రేవంత్ బృందం మరింత ఉత్సాహంతో దూసుకుపోతోంది. మధ్యమద్యలో సొంత నాయకుల నుంచి కొన్ని వ్యతిరేకతలు ఎదురైనా అగ్రనేతల ఆశీస్సులతో దీటుగా ఎదుర్కొంటూ తన పంథాలో ముందుకు వెళుతున్నారు.
మరోసారి రాహుల్ గాంధీని రాష్ట్రానికి రప్పించి పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ఉత్సాహం నింపాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో రాహుల్ రాష్ట్ర పర్యటన ఖరారు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఇదే సందర్భంలో రాహుల్ అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి భారత్ జోడో పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 3600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయడానికి రాహుల్ సిద్ధమవుతున్నారు.
దీనిలో భాగంగానే రాహుల్ తెలంగాణలో కూడా పాదయాత్ర చేయనున్నారు. మక్తల్ వద్ద రాష్ట్రంలోకి ఆయన ప్రవేశిస్తారు. నారాయణపేట్, కొడంగల్, పరిగి, వికారాబాద్, ఉమ్మడి నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల మీదుగా మహారాష్ట్రకు రాహుల్ వెళ్తారని రేవంత్ బృందం చెబుతోంది. ఈ పాదయాత్రను భారీ సక్సెస్ చేసేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై పార్టీని విజయతీరాలవైపు నడిపించాలని రాహుల్-రేవంత్ (ఆర్-ఆర్) ప్రణాళికగా చెబుతున్నారు. మరి ఈ ఆర్-ఆర్ టీం హిట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.