ఢిల్లీ బానిసలకు, తెలంగాణ ఆత్మగౌరవానికి జరగబోయే పోటీనే రాబోయే ఎలక్షన్లు : మంత్రి కేటీఆర్

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ బానిసలకు, తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగనున్న పోటీగా కేటీఆర్ అభివర్ణించారు.

Advertisement
Update:2023-08-09 17:06 IST

కాంగ్రెస్, బీజేపీ నాయకులు తుమ్మాలన్నా, దగ్గాలన్నా ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వాలి. కానీ మన సీఎం కేసీఆర్ అనుకున్న వెంటనే ఇక్కడ అనేక పథకాలు అమలు చేస్తారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. ప్రతీ విషయానికి ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుందని.. అదే మన ప్రభుత్వం అయితే అలాంటి ఇబ్బందులేవీ ఉండవని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్, న్యాక్ బిల్డింగ్, కార్పొరేషన్ భవనాలతో పాటు పలు అభివృద్ధి పథకాలను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..

తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్, బీజేపీలు అవరోధంగా మారాయని చెప్పారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటల కరెంట్ చాలంటోంది. బీజేపీ మతం మంటలను రాజేస్తోంది. మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా.. మతం మంటల బీజేపీ కావాలా.. మూడు పంటలకు నీళ్లు ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం మణిపూర్, హర్యానాలో జరుగుతున్న హింస, అల్లర్లును ఆపలేక పోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనను తాను తెలంగాణ వాదిగా చెప్పుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదు.. ఆయన తెలంగాణకు పట్టిన వ్యాధి అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీకి బానిసలుగా వ్యవహరించే బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మన తెలంగాణను అప్పగిద్దామా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ బానిసలకు, తెలంగాణ ఆత్మ గౌరవానికి మధ్య జరుగనున్న పోటీగా కేటీఆర్ అభివర్ణించారు.

ఇక్కడి ఎంపీ ధర్మపురి అరవింద్‌కు అసలు మతి లేదు. 70 ఏళ్ల కేసీఆర్‌ను పట్టుకొని ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రి ధర్మపురి శ్రీనివాస్‌ను మేము అనలేమా.. కానీ మాకు సంస్కారం ఉంది కాబట్టే మాట్లాడటం లేదని కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి ఎంపీని ఓడించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజలకు కావల్సింది అభివృద్ధి, సంక్షేమమే..

నిజామాబాద్‌తో పాటు.. తెలంగాణ ప్రజలందరూ కోరుకునేది అభివృద్ధి, సంక్షేమమే అని కేటీఆర్ చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతీ వర్గం, ప్రతీ ప్రాంతానికి అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో ఐటీ టవర్ ప్రారంభించాము. స్థానికంగా ఉండే యువతకు ఇక్కడ నైపుణ్యంలో శిక్షణతో పాటు ఉద్యోగాలు కూడా లభిస్తాయని చెప్పారు.

ఐటీ టవర్ ద్వారా ప్రతీ ఒక్కరు నైపుణ్యం పెంచుకోవడమే కాకుండా ఆయా రంగాల్లో అనుభవాన్ని కూడా ఏర్పరచుకోవాలని మంత్రి చెప్పారు. రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సదుపాయాలను ఉపయోగించుకొని.. అందరూ తమ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

తెలంగాణ పచ్చగా ఉంది..

హైదరాబాద్ నుంచి నాతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు వచ్చారు. మేము హెలికాప్టర్‌లో ప్రయాణించే సమయంలో రాజధాని నుంచి నిజామాబాద్ వరకు చెరువులు, కుంటలు నిండుగా.. పొలాలు పచ్చగా ఉన్నాయి. ఒకప్పుడు బీడువారిన నేలలు కనప్పడ్డ నేల.. ఇవ్వాళ పచ్చగా కనపడుతోందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేది. కానీ ఇవ్వాళ 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందని.. పంజాబ్ రాష్ట్రాన్ని కూడా మనం అధిగమించామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

సఫాయన్నా.. నీకు సలాం..

కరోనా పాండమిక్ సమయంలో బయటకు వచ్చి మరీ పని చేసింది సఫాయి అన్నలు, అక్కలే. ఈ రోజు మధ్యాహ్నం వాళ్లతో కలిసి భోజనం చేశాను. వారి సేవలను మరువలేనివని చెప్పారు. మీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎలాంటి వ్యక్తి అని అడిగితే.. మమ్మల్ని సొంత ఆడపడచుల్లా చూసుకుంటారని చెప్పారు. ప్రతీ కార్మిక దినోత్సవం, మహిళా దినోత్సవం నాడు మాతో కలిసి భోజనం చేయడమే కాకుండా.. బట్టలు కూడా పెడతారని నాతో చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ పట్టణాన్ని ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంతో అభివృద్ది చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనకే ఓటు వేసి గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్ కొర్పొరేషన్‌లోని ప్రతీ డివిజన్‌కు రూ.1 కోటి చొప్పున మంజూరు చేస్తున్నానని మంత్రి ప్రకటించారు. అంతర్గత రోడ్లు, లైటింగ్, డివైడర్ల నిర్మాణానికి ఈ నిధులు వాడుకోవాలని మంత్రి చెప్పారు.

ఐటీ టవర్‌తో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభం..

నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడ ఐటీ టవర్, న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐటీ టవర్‌ను రూ.50 కోట్ల వ్యయంతో 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలోనిర్మించారు. ఇక న్యాక్ భవనాన్ని ఆర్ అండ్ బీ శాఖ నిర్మించింది. అంతే కాకుండా మూడు శ్మశాన వాటికలను, రఘునాథ చెరువు ట్యాంక్ బండ్‌ను మంత్రి ప్రారంభించారు.  


Tags:    
Advertisement

Similar News