ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు యువకులు మృతి
ఈ ఘటనలో రోహిత్, బాలప్రసన్న వంతెన పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
అతి వేగం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. మృతుల్లో ఒకరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాగా, మరొక వ్యక్తి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్, ఉద్యోగ అన్వేషణలో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై మసీద్‌బండ్ నుంచి హఫీజ్ పేట్ వైపు వెళుతున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ పైకి వచ్చేసరికి అతి వేగంగా నడుపుతున్న వీరి బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది.
ఈ ఘటనలో రోహిత్, బాలప్రసన్న వంతెన పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన వీరిద్దరినీ స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వీరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.