టీఎస్‌పీఎస్సీ కేసు.. శంకర లక్ష్మి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్న సిట్

గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన సిట్ బృందం.. లీకేజీ అంశంలో శంకరలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు.

Advertisement
Update:2023-05-24 13:01 IST

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో సిట్ అధికారుల విచారణ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే ఈ కేసులో 37 మందిని అరెస్టు చేసి.. లోతుగా విచారించారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తున్నది. కమిషన్ కార్యాలయంలోని కాన్ఫిడెన్షియల్ విభాగం ఇంచార్జిగా ఉన్న శంకర లక్ష్మి పాత్రపై సిట్ కొన్నాళ్లుగా లోతుగా విచారిస్తోంది.

శంకర లక్ష్మి ఇంచార్జిగా ఉన్న సెక్షన్‌లోనే ప్రశపత్రాలు భద్రపరిచే సర్వర్ ఉంటుంది. దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్ ఆమె దగ్గరే ఉంటాయి. సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి.. శంకర లక్ష్మి నుంచి పాస్‌వర్డ్‌లు దొంగిలించి.. సర్వర్లకు రిమోట్ యాక్సెస్ ఇచ్చినట్లు మొదట్లోనే సిట్ అధికారులు గుర్తించారు. అయితే తాను ఎవరికీ పాస్‌వర్డ్‌లు చెప్పలేదని, ఎక్కడా రాయలేదని ఆమె పేర్కొన్నారు.

కాగా, గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన సిట్ బృందం.. లీకేజీ అంశంలో శంకరలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. రాజశేఖర్‌కు ఆమే పాస్‌వర్డ్ ఇచ్చినట్లు.. పేపర్ లీక్ విషయం కూడా ఆమెకు తెలిసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఒకటి రెండు రోజుల్లో శంకర లక్ష్మిని అరెస్టు చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆమె ప్రమేయంపై కీలక సమాచారంతో పాటు, కాల్ డేటాను కూడా సిట్ సేకరించింది. వీటిని విశ్లేషించిన తర్వాతే శంకర లక్ష్మి పాత్రపై అనుమానాలు మరింతగా పెరిగాయి.

మరో వైపు సిట్ విచారణకు రేణుకను మరోసారి పిలవనున్నారు. కోర్టు నుంచి మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్న సిట్.. రేణుకను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకొని వచ్చి విచారించనున్నట్లు తెలుస్తోంది. డీఏఓ పరీక్షలో టాప్ స్కోర్లు సాధించిన రాహుల్, శాంతి, సుచరితలను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరి కొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

Tags:    
Advertisement

Similar News