తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్.. రేవంత్ మద్దతు ఎవరికంటే..?
కర్నాటకలో డీకే శివకుమార్ కు పీసీసీతోపాటు డిప్యూటీసీఎంగా అవకాశం ఇచ్చినట్టే.. తెలంగాణలో తనకు కూడా ఆ రెండూ ఇవ్వాలని అడుగుతున్నారట భట్టి.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని విజయతీరాలకు చేర్చి సీఎం పీఠం అధిరోహించారు. ఈ దశలో ఆయన పాలనపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. రాబోయే లోక్ సభ ఎన్నికలకోసం పీసీసీ చీఫ్ హోదాలో పార్టీకోసం పెద్ద ఎత్తున కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అందుకే పీసీసీ పదవికి మరో నేతను వెదుకుతోంది కాంగ్రెస్ అధిష్టానం.
మొదటి పోటీదారు భట్టి..
డిప్యూటీ సీఎం పోస్ట్ తో సరిపెట్టుకున్న సీనియర్ నేత భట్టి విక్రమార్క పీసీసీ పగ్గాలపై ఆశపడుతున్నారు. ఇప్పటికే భట్టి కోర్కెల్లో ఒకటి నెరవేర్చింది అధిష్టానం. ఆయన్ను తెలంగాణకు ఏకైక డిప్యూటీ సీఎంగా నియమించింది. అయితే ఆయన పీసీసీ కూడా కావాలంటున్నారు. సామాజిక వర్గంతోపాటు, సీనియార్టీ కూడా ఆయనకు కలసి వచ్చే అంశం. కర్నాటకలో డీకే శివకుమార్ కు పీసీసీతోపాటు డిప్యూటీసీఎంగా అవకాశం ఇచ్చినట్టే.. తెలంగాణలో తనకు కూడా ఆ రెండూ ఇవ్వాలని అడుగుతున్నారట భట్టి.
బీసీలకు అవకాశం ఇస్తారా..?
రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారు. ఇక పీసీసీని బీసీల చేతుల్లో పెడితే అక్కడికి సామాజిక న్యాయం చేసినట్టవుతుంది. అందుకే బలమైన, నమ్మకమైన బీసీ నేతకోసం అధిష్టానం వెదుకుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పొన్నం ఆల్రడీ మంత్రిగా ఉన్నారు, మధుయాష్కీ ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మహేశ్ గౌడ్, వీహెచ్ ల పేర్లపై ఫైనల్ గా చర్చ జరుగుతున్నట్టు చెబుతున్నారు.
రేవంత్ ఎటువైపు..?
పీసీసీ పదవిని వదులుకోవాల్సిన సందర్భంలో తనకు అనుకూలమైనవారు ఆ పదవిలో ఉంటే మేలు అని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహేశ్ గౌడ్, వీహెచ్.. వీరిద్దరిలో ఆయన ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. మొత్తమ్మీద.. జనవరి రెండో వారానికల్లా తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశముంది. లోక్ సభ ఎన్నికలు ఆ కొత్త అధ్యక్షుడికి తొలి పరీక్ష కాబోతున్నాయి.