ప్రజా వేదిక - వైసీపీ ఆఫీస్.. ఏది న్యాయం..? ఎవరిది అన్యాయం..?

అప్పుడు వైసీపీ తప్పు చేస్తే, ఇప్పుడు టీడీపీ కూడా తప్పు చేస్తుందా.. అనే ప్రశ్న వినపడుతోంది. వాళ్లు విధ్వంసం చేశారన్న టీడీపీ ఆరోపణలు నిజమైతే.. మరి వీళ్లు ఇప్పుడు చేస్తున్నదేంటి..?

Advertisement
Update: 2024-06-22 03:02 GMT

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ ఇచ్చిన తొలి కీలక ఆదేశం ప్రజా వేదిక కూల్చివేత. అప్పట్లో టీడీపీ పెద్ద గొడవ చేసింది. కూల్చివేతలతో మొదలైన వైసీపీ పాలన చివరికి కూలిపోతుందంటూ శాపనార్థాలు పెట్టింది. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారింది, కానీ కూల్చివేత సీన్ రిపీట్ అయింది. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ ని కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. దీంతో వైసీపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఏపీలో విధ్వంస పాలన మొదలైందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

5 బుల్డోజర్లు,

రెండే రెండు గంటలు

తెల్లవారు ఝామునే కూల్చివేత మొదలు

ఎవరూ అక్కడికి రాకుండా పోలీసుల మోహరింపు

నోటీసులివ్వకుండా, వివరణ తీసుకోకుండానే కూల్చివేత

శ్లాబ్ కి సిద్ధంగా ఉన్న భవనం పూర్తిగా నేలమట్టమైంది. ఈ బిల్డింగ్ విషయంలో వైసీపీ శుక్రవారమే హైకోర్టుని ఆశ్రయించింది. చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దంటూ హైకోర్టు ఆదేశించినా అధికారులు తగ్గేదే లేదన్నారు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేశారు.

అప్పుడు వైసీపీ తప్పు చేస్తే, ఇప్పుడు టీడీపీ కూడా తప్పు చేస్తుందా..? అనే ప్రశ్న వినపడుతోంది. వాళ్లు విధ్వంసం చేశారన్న టీడీపీ ఆరోపణలు నిజమైతే.. మరి వీళ్లు ఇప్పుడు చేస్తున్నదేంటి..? ప్రజా వేదిక అక్రమ నిర్మాణమని కూల్చి వేస్తే, వైసీపీ ఆఫీస్ పై కూడా అదే ముద్రవేసి కూల్చివేత పూర్తి చేశారా..? ఈ కక్షలు, కార్పణ్యాలతో ప్రజలకు ఒరిగేదేంటి..? దీనికి ఇరు పార్టీల నేతలు సమాధానం చెప్పాల్సి ఉంది.

ఇప్పటికే ఏపీలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులు పెచ్చుమీరాయనే ఆరోపణలు వినపడుతున్నాయి. అసెంబ్లీ తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే గంటల వ్యవధిలో ఈ కూల్చివేత మొదలు కావడం విశేషం. దీనిపై టీడీపీ ఇంకా స్పందించలేదు. చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది అంటూ ఓ స్టేట్ మెంట్ విడుదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొంతమంది దెబ్బకు దెబ్బ అని సంబరాలు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఘటన వైసీపీకి అనుకూలంగా మారుతుందా, మరో ప్రజా పోరాటం మొదలు పెడతారా..? పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ కూల్చివేతపై ఎలా స్పందిస్తారు..? వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News