మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను గోస పెడుతున్నరు
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కిన నల్గొండ రైతులు
ధాన్యం కొనుగోలు చేయాలంటూ నల్గొండలో రైతులు రోడ్డెక్కారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ.. శెట్టిపాలెం మిల్లుల వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి నేషనల్ హైవేపై ధర్నా చేపట్టారు. కోదాడ జడ్చర్ల రోడ్డుపై మిల్లుల వద్ద ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆరుగాలం శ్రమించి తెచ్చిన పంటను మిల్లులకు తెస్తే మద్దతు ధర ఇవ్వకపోగా.. తాలు, తేమ పేరుతో నానా కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ సంగతి దేవుడెరుగు.. ఐకేపీ కేంద్రాలలలో సన్నాలను కొనేవారే లేరని వెల్లడించారు. గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చచెప్పడంతో రైతులు శాంతించారు.
రైతులు మాట్లాడుతూ... ధాన్యం పండించి దొంగలమయ్యాయని వాపోయారు. తిండి తిప్పలు లేకుండా రెండు రోజులుగా తిరగని మిల్లు లేదు. ప్రభుత్వం మద్దతు ధర ఇస్తామన్నది. కానీ ఆ మద్దతు ఇవ్వడం లేదన్నారు.. మిల్లుల దగ్గరి వస్తే 2000-2200 అంటున్నారు. మిల్లర్లు చెప్పే ధరకు వడ్లు అమ్మితే రైతులు అప్పులు పాలవడం ఖాయమన్నారు. మిల్లర్లు, ప్రభుత్వం కుమ్మక్కై రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తే రోడ్డుపై కూర్చునే దుస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.